BJP Telangana: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోరుకు బీజేపీ సమరశంఖం పూరించింది. ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు లేకుండా, ఈసారి ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమని కమలదళం స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది.
జనసేనతో కేవలం ఏపీలోనే.. తెలంగాణలో వేర్వేరుగా!
పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీతో బీజేపీ బలమైన మిత్రపక్షంగా కొనసాగుతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం ఆ సమీకరణాలు వర్తించవని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ సారి ఎన్నికల బరిలో జనసేన పార్టీ కూడా స్వతంత్రంగా నిలవాలని భావిస్తుండటంతో, తెలంగాణ గడ్డపై ఈ పార్టీల మధ్య పోరు తప్పేలా లేదు. గతంలో కొన్ని సందర్భాల్లో కలిసి పనిచేసినా, ఈ సారి మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్టుగా అడుగులు వేస్తున్నాయి.
Also Read: Municipal Elections: మునిసిపల్ ఎన్నికలపై బీజేపీ కీలక నిర్ణయం!.. జనసేనతో పొత్తుపై క్లారిటీ!
సర్పంచ్ ఎన్నికల స్ఫూర్తితో ముందుకు..
ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో గ్రామస్థాయిలో పార్టీ సాధించిన ఫలితాలు, పెరిగిన ఓటు బ్యాంకును స్ఫూర్తిగా తీసుకుని మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటూ, పట్టణ ప్రాంత ఓటర్లను ఆకర్షించేలా క్షేత్రస్థాయి వ్యూహాలను సిద్ధం చేసింది. ఒంటరిగా బరిలోకి దిగడం ద్వారా పార్టీ క్యాడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు, భవిష్యత్‌లో ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్నది బీజేపీ ఆలోచన. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నది. అభ్యర్థుల ఎంపికలోనూ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ, గెలుపు గుర్రాలనే బరిలోకి దించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. పొత్తులు లేని పోరులో కమలం పార్టీ ఏ మేరకు మెజారిటీ సాధిస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: BRS Protest: ఘనపూర్ ప్రాజక్టుకుసాగు నీటిని వదలాలి.. మెదక్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ నేతల ధర్నా!

