Case filed On Tv Channel: ఒక మహిళా ఐఏఎస్ అధికారికి, ఓ మంత్రికి సంబంధం అంటగడుతూ అనైతికంగా ఆరోపణలు గుప్పుమన్న విషయం తెలిసిందే. అయితే, ఈ వార్తను ప్రచురించిన ఒక తెలుగు న్యూస్ ఛానల్, ఒక ట్విటర్ పేజీ, మరికొన్ని న్యూస్ డిజిటల్ మీడియా ఛానల్స్ మీద కేసు నమోదయ్యింది. ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చి ఫేక్ వార్తలపై దర్యాప్తు చేపట్టాలంటూ తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్న జయేష్ రంజన్ ఫిర్యాదు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫేక్ న్యూస్ ప్రసారం, తద్వారా వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం కలిగించడం, ఒక మహిళా ఐఏఎస్ అధికారిని అసభ్యకర రీతిలో చిత్రీకరించే ప్రయత్నంపై దర్యాప్తు జరపాలని కోరారు. భారతీయ న్యాయ సంహిత-2023, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2000, ఇన్‌డీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ (ప్రొహిబిషన్) యాక్ట్ 1986 ప్రకారం ఈ చర్యలు శిక్షార్హమైనవని ఫిర్యాదులో జయేష్ రంజన్ వివరించారు.
Read Also- Huzurabad: విద్యార్థులు స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలి : ఏబీవీపీ నేత గోస్కుల అజయ్!
తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ తరపున ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి ఇంత దారుణంగా అసభ్యకర రీతిలో చిత్రకరించే ప్రయత్నం ద్వారా ఆమె గౌరవ, మర్యాదలను, నైతికతను ప్రభావితం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దుష్ప్రచారం చేసిన సదరు ఛానల్ మేనేజ్‌మెంట్, ఆ ఛానల్‌కు సంబంధించిన వ్యక్తులు ఒక మహిళా మహిళా ఐఏఎస్ అధికారిణి వ్యక్తిగత గోపత్యను తీవ్రంగా ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ విధమైన ప్రవర్తన తెలంగాణ రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు అందరినీ కించపరచడమే అవుతుందని పేర్కొన్నారు. జనవరి 8న సదరు ఛానల్‌లో అధికారిణిపై వెలువడ్డ ప్రసారం పూర్తిగా అబద్ధమని, కల్పితమైదని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధారమైన వార్తను ప్రసారం చేశారంటూ మండిపడ్డారు.
Read Also- Khammam District: తెలంగాణలో నివాస యోగ్య నగరంగా.. ముందు వరుసలో ఉన్న జిల్లా కేంద్రం ఇదే..?
ఫిర్యాదులో ఏముంది?
విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా అధికారిణిపై దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని, ఒక రాజకీయ నాయకుడితో ఆమెకు వ్యక్తిగత సంబంధం ఉన్నట్టుగా, ఆ సంబంధం వల్లే ఆమె అధికారిక పోస్టింగ్‌లు వచ్చాయంటూ నిరాధారమైన విషయాన్ని ప్రసారం చేశారని పేర్కొన్నారు. ఆ కథనంలో పేర్కొన్నట్టుగా ఫోన్ సంభాషణలు, కుటుంబ వ్యవహారాలు అన్ని అంశాలన్నీ పూర్తిగా కల్పితాలని పేర్కొన్నారు. ధృవీకరణ లేకుండా ఇలాంటి ఆరోపణలను బాధ్యతారాహిత్యంగా ప్రసారం చేయడంతో నిజాయితీతో పనిచేస్తున్న ఆ అధికారిణి వ్యక్తిత్వం హననానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిణిని వేధింపులకు గురిచేసినట్టేనని ఫిర్యాదులో జయేష్ రంజన్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణలోని ఇతర ఐఏఎస్‌లను కూడా బాధకు గురిచేశాయని చెప్పారు.
తక్కువ కాలంలోనే అనుకూలమైన పోస్టింగ్‌లు ఇచ్చారంటూ చవకబారు ఆరోపణలు చేయడాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. పరిపాలన సంబంధమైన ప్రక్రియను తప్పుగా చిత్రీకరించడమే కాకుండా, సివిల్ సర్వీసెస్ విశ్వసనీయతను, రాజ్యాంగబద్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియను కించపరిచేలా కథనాలు ప్రచురించారని వివరించారు. అధికారిణి పేరు నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, ఆమె పనిచేసిన ప్రాంతాలు, పోస్టింగులను ప్రస్తావించారని జయేష్ రంజన్ వివరించారు. వార్త ప్రసారంలో లైంగిక సంబంధమై మాటలు, ద్వంద్వార్థాలు, పరోక్ష నిందలను ఉపయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

