Yadadri Murder Case | మనుషులు మరీ దారుణంగా తయారవుతున్నారు. చిన్న చిన్న కారణాలకే సహనం కోల్పోయి హత్యలు చేసేసే దాకా వెళ్తున్నారు. ఆవేశంలో కన్న బిడ్డలను కూడా చంపడానికి వెనకాడట్లేదు కొందరు. తాజాగా యాదాద్రిజిల్లాలో ఇలాంటి దారుణమే జరిగింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ రూరల్ ఆరేగూడెంలో సైదులు దంపతులు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందరినీ ప్రైవేట్ స్కూళ్లలోనే చదివిస్తున్నారు. చిన్న కొడుకు భాను(14) చౌటుప్పల్ లోని అన్న మెమోరియల్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నాడు. కొంత కాలంగా సైదులు మద్యానికి బానిస అయి ఇంట్లో వారిని నిత్యం వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే భాను తమ స్కూల్ లో ఫిబ్రవరి 8న జరిగిన ఫేర్ వెల్ పార్టీకి వెళ్లి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న తండ్రి సైదులు ఆగ్రహానికి గురయ్యాడు.
Also Read : తల్లితో సహజీవనం.. కూతుర్లపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ కు HIV..!
ఎందుకు ఆలస్యంగా వచ్చావంటూ కొడుకును విచక్షణా రహితంగా చితకబాదాడు. భాను ఛాతిపై బలంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే కుటుంబీకులు స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. కొడుకును తానే చంపినట్టు ఎవరికీ చెప్పొద్దంటూ భార్య, పిల్లలను సైదులు బెదిరించడంతో పోస్టుమార్టం లేకుండానే అంత్యక్రియలు చేసేందుకు కుటుంబీకులు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం ఈ నోటా, ఆ నోటా పాకి పోలీసులకు తెలిసింది. పోలీసులు వచ్చి అంత్యక్రియలను అడ్డుకోవడంతో కుటుంబీకులు వాగ్వాదానికి దిగారు. చివరకు భాను మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. తండ్రి సైదులే కొట్టి చంపేశాడని పోలీసులు నిర్ధారించారు. అతన్ని అరెస్ట్ చేసి, కేసును విచారిస్తున్నారు.