Masood Azhar: ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) ద్వారా నేరుగా పాకిస్థాన్‌లోని (Pakistan) ఉగ్రవాద స్థావరాలపై భారత సైనిక బలగాలు దాడులు చేపట్టినా ఉగ్రవాదుల్లో మార్పు రావడం లేదు. ముఖ్యంగా నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (Jaish e Mohammed) చీఫ్ మసూద్ అజర్ (Masood Azhar) బుద్ధి అస్సలు మారడం లేదు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్ర కుట్రలు చేస్తూనే ఉన్నాడు. ఇందుకు బలం చేకూర్చే సంచలన ఆడియో ఒకటి లీక్ అయ్యింది. ఏ క్షణంలోనైనా దాడులకు పాల్పడేందుకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వెయ్యి మందికిపైగా ఆత్మహుతి బాంబర్లు సిద్ధంగా ఉన్నారంటూ మసూద్ అజర్ అనడం ఆ ఆడియోలో స్పష్టంగా వినిపించింది. భారత్‌లోకి చొరబడేందుకు అనుమతి ఇవ్వాలంటూ సూసైడ్ బాంబర్లు తనను తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారంటూ మసూద్ చెప్పాడు. జైషే మహ్మద్ గ్రూపునకు ఎంతమంది యోధులు ఉన్నారో బహిర్గతం అయితే ఈ ప్రపంచమే షాక్‌కు గురవుతుందని మసూద్ అన్నాడు.
ఆడియోలో ఏముంది?
‘‘ సూసైడ్ బాంబర్లు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వంద కాదు, 1000 కూడా కాదు. నిజంగా ఎంతమంది ఉన్నారో ఆ సంఖ్య నేను వెల్లడిస్తే రేపొద్దున ప్రపంచ మీడియాలో అల్లకల్లోలం చెలరేగుతుంది. వ్యక్తిగతంగా బాగా మోటివేట్ అయినవారు దాడులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. వారి లక్ష్యాలు సాధించాలని చూస్తున్నారు’’ అని మసూద్ అజర్ అన్నాడు. దాడులకు పాల్పడాలనుకుంటున్న ఉగ్రవాదులను అమరులు అంటూ సంభోదించాడు. అయితే, ఈ ఆడియో ఎప్పుడు రికార్డయ్యిందనేది తెలియరాలేదు. అలాగే, నిజంగా మసూద్ అజర్ గొంతేనా అనేది కూడా అధికారికంగా నిర్ధారించలేదు.
Read Also- Murder Case: భర్త హత్యను కళ్లారా చూసింది.. ఆ కేసుపై విచారణ జరుగుతుండగా ఊహించని ఘోరం
2019 నుంచి బయటకు కనిపించని మసూద్
మసూద్ అజర్ నేతృత్వంలో నడుస్తున్న ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌పై నిషేధం ఉంది. ఇక, మసూద్ ఒక ఉగ్రవాది అని ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించి, ప్రకటించింది. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతున్న ఈ దుర్మార్గుడు భారత్‌కు వ్యతిరేక కుట్రలు చేస్తున్నాడు. 2019 నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా మసూద్ అజర్ బహిరంగంగా కనిపించలేదు. ఆ ఏడాది బవహల్పూర్‌లో అతడు దాక్కునే నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు శక్తివంతమైన దాడి జరిపారు. అయితే, అదృష్టం కొద్దీ మసూద్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక అప్పటినుంచి జనాల్లో తిరగడం మానేశాడు.
ఎప్పుడూ భారత వ్యతిరేక వ్యాఖ్యలే
నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఎప్పుడూ భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఉగ్రవాదులను రెచ్చగొడుతూనే ఉంటాడు. చాలాకాలంగా ఇలాగే నడుచుకుంటున్నాడు. భారత్‌లో 2001లో జరిగిన పార్లమెంట్‌పై దాడ, 2008లో ముంబై దాడులకు ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా, పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్ స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా భారత్ మెరుపు దాడులు చేసి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఏకంగా బహవల్పూర్‌లోని జైష్ మహ్మద్ సంస్థ ప్రధాన కార్యాలయంపై కూడా ఎటాక్ చేసింది. ఈ దాడుల్లో మసూద్ అజర్‌కు అత్యంత సన్నిహిత వ్యక్తులు, అతడి కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. అయినప్పటికీ, అతడిలో మార్పు రాలేదు. పైగా, భారత్‌పై మరింత అక్కసు కక్కుతున్నాడు. ఇటీవల ఢిల్లీలో జరిగిన కారు బాంబ్ బ్లాస్ట్‌కు పాల్పడిన ఉమర్ మొహమ్మద్‌కు కూడా జైషే మహ్మద్ సంస్థతో సంబంధాలు ఉన్నట్టుగా తేలింది.

