Murder Case: రెండున్నరేళ్లక్రితం జరిగిన తన భర్త హత్యను ఓ మహిళా కళ్లారా చూసింది. ఆ కేసుపై ప్రస్తుతం కోర్టు విచారణ జరుగుతుండగా, ఆ మహిళ ప్రధాన సాక్షిగా ఉన్నారు. కేసు విచారణలో ఆమె వాంగ్మూలం అత్యంత కీలకంగా మారిన తరుణంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. శనివారం నాడు ఆమె హత్యకు (Murder Case) గురయ్యారు. షాక్‌కు గురిచేస్తున్న ఈ ఘటన దేశరాజధాని న్యూఢిల్లీలో (Delhi Murder Case) జరిగింది.
రచనా యాదవ్ అనే 44 ఏళ్ల మహిళను ఇద్దరు దుండకులు శనివారం నాడు (జనవరి 11) తుపాకీతో కాల్చిచంపారు. షాలీమార్ బాగ్ ఏరియాలో అప్పటికే బైక్ సిద్ధంగా ఉన్న వ్యక్తులు.. రచన యాదవ్ వారికి దగ్గరిగా వచ్చాక పాయింట్ బ్లాంక్‌తో తుపాకీ గురిపెట్టి కాల్చారు. దీంతో ఆమె అక్కడిక్కడే చనిపోయారు. అప్పటికే సిద్ధం చేసుకున్న బైక్‌పై దుండగులు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, అప్పటికే ఆమె మృతి చెందింది. అనుమానిత నిందిత వ్యక్తులు రచనా కోసం స్పోర్ట్స్ బైక్‌పై వేచిచూడడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఆ స్పోర్ట్స్ బైక్‌పై హత్య చేసిన వెంటనే, వేగంగా పారిపోయేలా పక్క ప్లాన్‌తో వ్యవహరించారు.
భర్తను చంపినవారే చంపేశారు!
తన భర్తను హత్య చేసినవారే రచనా యాదవ్‌ను కూడా మర్డర్ చేసినట్టుగా అనుమానిస్తున్నారు. అనుమానిత వ్యక్తి భరత్ యాదవ్‌కు, మృతురాలి హత్య కేసుతో సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్నట్టు చెప్పారు. రచనా భర్త విజేంద్ర యాదవ్ 2023లో హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత కక్ష విషయమై చంపేసినట్టుగా భరత్ యాదవ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ హత్య కేసులో మిగతా నిందితులు పట్టుబడినప్పటికీ, ప్రధాన నిందితుడిగా ఉన్న భరత్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
తన భర్త హత్య కేసు విచారణలో రచనా కీలకంగా మారారని, ఆమె చంపేస్తే కేసు బలహీనం అవుతుందని భావించి ఉంటారని పోలీసులు అంటున్నారు. అంతేకాదు, ఇతర సాక్ష్యాలను భయపెట్టాలనేది కూడా వారి ఉద్దేశ్యం అయ్యుండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఒక మహిళపై కాల్పులు జరిగినట్టుగా ఉదయం 10.59 గంటలకు తమకు సమాచారం అందిందని, వెంటనే అక్కడికి చేరుకోగా, ఆమె రక్తపు మడుగులో పడివున్నారని పోలీసులు తెలిపారు.
హత్యకు ముందు రచనా తన పొరుగింటి వ్యక్తిని కలిశాక, తిరిగి ఇంటికి వెళుతుండగా తొలుత బైక్‌తో ఢీకొట్టి, ఆ తర్వాత పేరు అడిగి, నిర్ధారణ అయిన తర్వాత కాల్పులు జరిపినట్టు తెలిసిందన్నారు. రచనా కదలికల గురించి నిందిత వ్యక్తులకు ముందుగానే అవగాహన ఉందని, రెక్కీ నిర్వహించినట్టుగా దీనినిబట్టి అర్థమవుతోందని పోలీసులు తెలిపారు. రచనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, ఒకరికి పెళ్లవ్వగా, మరొకరు తల్లితో ఉంటున్నారని తెలిపారు. రచన హత్య నేపథ్యంలో వారి ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేసినట్టు పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఇక, రచనా హత్య కేసుపై దర్యాప్తు జరుగుతోందని, చట్టప్రకారం ముందుకెళతామని పేర్కొన్నారు.

