YCP Office | ఏపీలోని తాడేపల్లిలో ఉన్న వైసీపీ కార్యాలయానికి అమరావతి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5న ఆఫీసుకి సమీపంలో ఉన్న గార్డెన్ లో మంటలు వ్యాపించిన ఘటనపై విచారణలో భాగంగా ఈ నోటీసులు అందజేశారు. సీసీ ఫుటేజీ ఇవ్వాలని అందులో
పేర్కొన్నారు. కాగా, మంటలు వ్యాపించడానికి గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు.
తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసం పక్కనే వైసీపీ కేంద్ర కార్యాలయం (YCP Office) ఉంటుంది. దానికి ఎదురుగా గార్డెన్ ఉంటుంది. గత బుధవారం ఈ గార్డెన్ వద్ద మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా? లేక దీని వెనుక కుట్ర దాగి ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించనున్నారు.
మరోవైపు మంటలు చెలరేగిన ఘటనపై వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ ఘటనకు కారకులైన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని, ఇటువంటివి పునరావృతం కాకుండా జగన్ నివాసం, వైసీపీ ఆఫీసు వద్ద భద్రతను పెంచాలని డిమాండ్ చేసింది. ఇదిలావుంటే… వైసీపీ కార్యాలయానికి నోటీసులు జారీ చేయడం ఏపీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా, వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై తెలుగుదేశం ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.