Minister Sridhar Babu: తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ క్యాపిటల్ గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. టెక్నాలజీ కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, దేశ సేవకు, ఆత్మ నిర్భరతకు ఉపయోగపడాలన్నారు. శనివారం బిట్స్ పిలానీ-హైదరాబాద్(Hyderabad) క్యాంపస్‌లో నిర్వహించిన బిట్స్ అల్యూమ్ని అసోసియేషన్ గ్లోబల్ మీట్ 2026 కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇతర దేశాలు ప్రైవేట్ గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తే, భారత్ మాత్రం ఆధార్, యూపీఐ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ప్రపంచానికి దిక్సూచిగా నిలిచిందన్నారు.
ఇంటెలిజెన్స్ కంటే..
దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఏఐ(AI) ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ ఛేంజ్(Telangana Data Exchange) పరిశోధనలకు గొప్ప ఊతమిస్తోందన్నారు. త్వరలో ప్రారంభించబోయే తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ యూనివర్సిటీలు గేమ్ ఛేంజర్‌గా మారి ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తాయన్నారు. ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఇంటెలిజెన్స్ కంటే కో-ఆర్డినేషన్ అత్యంత ఖరీదైనదిగా మారిందన్నారు. ఏఐ వినియోగంలో డేటా ప్రైవసీ, ఎథిక్స్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ఆర్ అండ్ డీపై దృష్టి సారించాలని టెక్ కంపెనీలను కోరారు.
ఏఐ ఫలితాలు కేవలం నగరాలకే..
ఒకప్పుడు స్కేల్, స్పీడ్, వాల్యూయేషన్ ప్రాతిపదికన కంపెనీల సక్సెస్ నిర్ణయించబడేదని.. ఇప్పుడు ఆర్కిటెక్చర్, డేటా ఓనర్ షిప్, డెసిషన్ స్పీడ్న, నమ్మకంపైనే వాటి మనుగడ ఆధారపడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో కేవలం కోడింగ్ తెలిసిన వారి కంటే, సమస్య మూలాలను గుర్తించి పరిష్కరించగల క్రియేటివ్ థింకర్స్ కే జాబ్ మార్కెట్‌లో డిమాండ్ ఉంటుందన్నారు. ఏఐ ఫలితాలు కేవలం నగరాలకే పరిమితం కాకూడదని, వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లోని గ్రామీణ సమస్యలకు పరిష్కారం చూపేలా పరిశోధనలు జరగాలన్నారు. అప్పుడే టెక్నాలజీ ఫలాలు సామాన్యులకు కూడా అందుతాయన్నారు. ‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం కావాలని బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులను, యాజమాన్యాన్ని మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఏఐ, ఇన్నోవేషన్, అకడమిక్ రీసెర్చ్ వంటి అంశాల్లో బిట్స్ పిలానీతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో బిట్స్ అలుమ్ని అసోసియేషన్ ఛైర్ పర్సన్ ప్రేమ్ జైన్, మ్యాప్ మై ఇండియా ఫౌండర్ అండ్ ఛైర్మన్ రాకేష్ వర్మ, బీజీఎం 2026 ఛైర్ పర్సన్ అనిత తదితరులు పాల్గొన్నారు.
Also Read: MLA Mallareddy: కాంగ్రెస్ ప్రభుత్వం పై మల్లారెడ్డి ఫైర్.. తనదైన శైలిలో సవాళ్లు విసిరిన ఎమ్మెల్యే..?

