Ayodhya Ram Temple: ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో శుక్రవారం అనూహ్య ఘటన జరిగింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి అయోధ్యలోని బాలరాముడి ఆలయంలోకి (Ayodhya Ram Temple) ప్రవేశించి, కాంప్లెక్స్‌లో నమాజ్ చేసేందుకు ప్రయత్నించాడు. కొన్ని నినాదాలు కూడా చేశాడు. అయితే, సిబ్బంది గుర్తించి అడ్డుకున్నారు. నిందిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందిత వ్యక్తి పేరు అహ్మద్ షేక్ అని పోలీసులు గుర్తించారు. కశ్మీర్ జిల్లాలోని షోపియాన్ జిల్లాకు చెందినవాడని వివరించారు. అతడి వయసు 55 ఏళ్లు ఉంటాయని, శుక్రవారం అతడు ఆలయంలోని హైసెక్యూరిటీ జోన్ ప్రాంగణంలోకి ప్రవేశించాడని తెలిపారు. ఆలయాన్ని సందర్శించిన తర్వాత, గుడిలోని సీతా రసోయ్ ప్రదేశంలో కూర్చొని, నమాజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఆలయ సెక్యూరిటీ సిబ్బంది పసిగట్టారు. ఆలయంలో నమాజ్ చేయకుండా అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత స్థానిక పోలీసులకు అప్పగించారు. దీంతో, నిందిత వ్యక్తి అహ్మద్ షేక్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఆలయ సెక్యూరిటీ సిబ్బంది స్పందించి నమాజ్ చేయకుండా అడ్డుకున్న సమయంలో నిందిత వ్యక్తి నినాదాలు చేసినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని నిర్ధారించలేదు. కాగా, నిందిత వ్యక్తిని పోలీసులు, ఇంటెలిజెన్సీ ఏజెన్సీలు ప్రస్తుతం ప్రశ్నిస్తున్నాయి. ఆలయంలో నమాజ్ చేయాలనుకోవడానికి కారణం ఏంటనేదానిపై ఆరా తీస్తున్నారు. అయోధ్య చేరుకోవడానికి ఎలా ప్రయాణించాడు, ఎక్కడెక్కడ తిరిగాడు అనే కోణాల్లో కూడా వివరాలు రాబడుతున్నారు. అయోధ్య ఎందుకు వచ్చాడు?, అతడితో పాటు ఇంకెవరైనా వచ్చారా? అనే అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు.
Read Also- The RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మొదటి రోజు కింగ్ సైజ్ కలెక్షన్స్ ఎంతంటే?.. అఫిషియల్..
జేబుల్లో జీడిపప్పులు, ఎండుద్రాక్షలు
నిందితుడు అహ్మద్ షేక్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అతడి వద్ద జీడిపప్పులు, ఎండు ద్రాక్షలు లభించాయని పోలీసులు తెలిపారు. తాను అజ్మీర్ వెళ్తున్నట్టుగా విచారణాధికారులతో నిందిత వ్యక్తి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో అయోధ్య ఆలయంలో భద్రతపై ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో భద్రతా ఏర్పాట్లను పోలీసులు, ఇంటెలిజెన్సీ అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే, ఈ ఘటనపై స్పందించేందుకు జిల్లా పాలనా యంత్రాంగం, రామాలయం ట్రస్ట్ నిరాకరించాయి.
వచ్చే వారం మకర సంక్రాంతి వేడుకలకు సమాయత్తం అవుతున్న తరుణంలో ఈ ఘటన జరగడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. మకర సంక్రాంతి సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో రామమందిరాన్ని దర్శించుకుంటారు. మరోవైపు, జనవరి 22న అయోధ్య రామాలయం రెండవ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. కాబట్టి, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించారు.
Read Also- Road Safety Week: జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో.. విద్యార్థులకు అవగాహన ర్యాలీ!

