నర్సంపేట, స్వేచ్ఛ: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామంలో గుప్తనిధుల (Hidden Treasures) తవ్వకాలు కలకలం రేపింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి గుప్తనిధుల కోసం కొందరు జేసీబీలతో తవ్వకాలు జరుపుతుండగా చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులను చూసిన నిందితులు పరుగులు పెట్టారు. అందులో కొందరిని పోలీసులు వెంబడించి పట్టుకుని ఒక జేసీబీ, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో ఇద్దరు ముఠా సభ్యులు ఉన్నట్టు, మరికొందరు పరారయ్యారని తెలుస్తున్నది. తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.