ఢిల్లీ ఎన్నికల ఫలితాల (Delhi Election Results)కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ జోస్యం నిజమైంది. పదేళ్లుగా హస్తినను పాలిస్తున్న ఆమ్ఆద్మీ పార్టీని తిరస్కరించి, ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. దీంతో మూడోసారి అధికారం కైవసం చేసుకోవాలని తీవ్రంగా శ్రమించిన ఆప్ ఆశలు గల్లంతై… దాదాపు మూడు దశాబ్దాలుగా అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న కమలం పార్టీకి కల నెరవేరినట్లయింది.
మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను 36 సీట్లలో బీజేపీ విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది. మరో 11 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 20 స్థానాల్లో గెలుపొందిన ఆప్ మరో 3 చోట్ల మాత్రమే లీడ్ లో ఉంది. లిక్కర్ స్కాంలో నిందితులుగా ఉన్న మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పార్టీలో నెంబర్ 2 గా ఉన్న మనీశ్ సిసోడియా తోపాటు పలువురు అగ్రనేతలు ఓటమి పాలయ్యారు. కేజ్రీవాల్ ఏ అవినీతి ఉద్యమాలకు వ్యతిరేకంగా పోరాడి రాజకీయాలకు వచ్చారో అవే అవినీతి ఆరోపణలతో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
అధికార పార్టీ పై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రచారాస్త్రాలుగా మలుచుకున్న కాషాయ పార్టీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో జెండా పాతింది. ఇక తమ పార్టీ ఘోరంగా దెబ్బతిన్నప్పటికీ ప్రస్తుత ముఖ్యమంత్రి అతీశీ విజయం సాధించి పరువు దక్కించుకున్నారు. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ పై పోటీ చేసిన పర్వేశ్ 4 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపోంది టాక్ ఆఫ్ ది నేషన్ గా నిలిచారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల (Delhi Election Results)లో బీజేపీ ఘన విజయం నేపథ్యంలో ఆయనే సీఎం అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.