Kavitha – Azharuddin: బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) శాసన మండలి సభ్యత్వానికి చేసిన రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం రాత్రి ఆమోదించారు. బీఆర్ఎస్‌తో పాటు పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి గత ఏడాది సెప్టెంబర్ 3న ఆమె రాజీనామా చేశారు. 4 నెలలుగా రాజీనామాను ఆమోదించకుండా మండల చైర్మన్ పెండింగ్‌లో పెట్టారు.
రాజీనామా నోటిఫికేషన్ జారీ
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం (ఈ నెల 5న) శాసనమండలి భేటీకి కవిత హాజరయ్యారు. సుమారు అరగంట పాటు ప్రసంగించి తెలంగాణ ఉద్యమంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో తాను పోషించిన పాత్ర, పార్టీలో తనకు ఎదురైన అనుభవాలు, అవమానాలు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామాకు దారి తీసిన కారణాలను వివరించారు. తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్‌ను విజ్ఞప్తి చేశారు. భావోద్వేగాలతో నిర్ణయం తీసుకోవద్దని ఆయన సూచించినా, రాజీనామా నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు కవిత పేర్కొన్నారు. దీంతో శాసన మండలి నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాను చైర్మన్ మంగళవారం ఆమోదించారు. ఈ మేరకు లెజిస్లేటివ్ సెక్రెటరీ డాక్టర్ నరసింహ చార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు.
రేసులోకి అజారుద్దీన్..
కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవి లేకుండా మంత్రి అయిన అజారుద్దీన్ కు లైన్ క్రియర్ అయినట్లైంది. ఫిబ్రవరిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనుండగా.. దాని తర్వాత స్థానిక సంస్థల కోటలో ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మంత్రి పదవి చేపట్టిన 6 నెలలోగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా అజారుద్దీన్ ఎన్నిక కావాల్సి ఉంటుంది. లేదంటే రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం మంత్రి పదవి పోతుంది. కాబట్టి అజారుద్దీన్ ను అసెంబ్లీకి పంపేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్న క్రమంలోనే కవిత ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కావడం.. కాంగ్రెస్ కు కొత్త అవకాశాన్ని ఇచ్చినట్లైంది.
Also Read: Telangana Govt: విద్యుత్ సబ్సిడీల్లో అన్నదాతదే అగ్రభాగం.. వ్యవసాయ రంగానికి రూ.13,499 కోట్లు!
ఉగాదికి కొత్త పార్టీ?
మరోవైపు తెలంగాణ రాజకీయ వేదికపై కొత్త పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) త్వరలో కొత్త రాజకీయ పార్టీ (New Political Party)ని ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఉద్యమ సంస్థ అయిన తెలంగాణ జాగృతిని త్వరలో రాజకీయ పార్టీగా ఆమె మార్చబోతున్నట్లు తెలుస్తోంది. ఉగాదికి తన కొత్త రాజకీయ పార్టీని కవిత అధికారికంగా ప్రకటించే అకాశముందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి వచ్చే నెలలో కవిత రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ భేటిలోనే పార్టీని సైతం ఆమె ఖరారు చేసే ఛాన్స్ ఉందని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

