MLC Naveen Rao: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు (MLC Naveen Rao) నోటీసులు ఇచ్చి కార్యాలయానికి పిలిపించారు. గ్రే హౌండ్స్ ఎస్పీ రవీందర్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటరమణ దాదాపు 9 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ నెల 16న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన నివేదికను సిట్ అధికారులు సుప్రీంకోర్టుకు ఇవ్వనున్నారు. ఇప్పటికే కేసుకు లాజికల్ కన్‌క్లూజన్ ఇవ్వాలని భావిస్తున్న విచారణాధికారులు ఆ దిశగా ఆధారాలు, సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే సిట్ అధికారులు మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు.
సంధ్య శ్రీధర్‌పై కేసులు ఎందుకు నమోదు
ఉదయం 11 గంటలకు నవీన్ రావు సిట్ కార్యాలయానికి రాగా రాత్రి 8.30 గంటల వరకు ప్రశ్నించారు. గతంలో నవీన్ రావు సైబరాబాద్ పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా సంధ్య శ్రీధర్‌పై కేసులు నమోదయ్యేలా చూశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీని గురించి సిట్ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలిసింది. ఎవరు చెబితే పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చారు, సంధ్య శ్రీధర్‌పై కేసులు ఎందుకు నమోదు చేయించాల్సి వచ్చింది అని అడిగినట్టుగా తెలిసింది. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులు గెస్ట్ హౌస్‌కు ఎందుకు వచ్చేవారు, ఏం మాట్లాడుకునే వారు అని కూడా ప్రశ్నించినట్టుగా సమాచారం.
Also Read: BRS MLA on Kavitha: కుక్కతో పోల్చుతూ కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సెన్సేషనల్ వ్యాఖ్యలు.. తీవ్ర ఆరోపణలు
విచారణకు సహకరించా
సిట్ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తరువాత నవీన్ రావు మీడియాతో మాట్లాడుతూ, విచారణకు పూర్తిగా సహకరించినట్టు చెప్పారు. 2024 సెప్టెంబర్‌లో విచారణకు పిలిచినప్పుడు కూడా హాజరైనట్టు తెలిపారు. ప్రచారం జరుగుతున్నట్టుగా ఫోన్ ట్యాపింగ్ పరికరాలు, ఇతర మెటీరియల్‌కు సంబంధించి తనను ఎలాంటి ప్రశ్నలు అడగలేదన్నారు. నేతలు, వ్యక్తులతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారని చెప్పారు. అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చానన్నారు. గతంలో జరిపిన విచారణలో ఏం చెప్పానో, ఇప్పుడు కూడా అదే చెప్పానన్నారు. ట్యాపింగ్ పరికరాలను తాను సమకూర్చానన్న అంశమే చర్చకు రాలేదని చెప్పారు. ఆరోపణల పేరుతో అవాస్తవాలను నమ్మొద్దని కోరారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులతో పరిచయం ఉన్నదనే అనుమానంతో ప్రశ్నించారని అన్నారు. సిట్ ఎప్పుడు పిలిచినా సహకరిస్తానని తెలిపారు.
రాజకీయ కుట్ర
ఎలాంటి ఆధారాలు లేకున్నా సిట్ అధికారులు నవీన్ రావును విచారణకు పిలిచారని కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సిట్ కార్యాలయం నుంచి నవీన్ రావును తీసుకెళ్లడానికి జూబ్లీహిల్స్ స్టేషన్ వద్దకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. నవీన్ రావు విచారణ రాజకీయ కుట్ర అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా ప్రజలు, అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు.
Also Read: Naveen Yadav: అయిదోసారి వరించిన విజయం.. నాలుగు ఓటమి గెలుపుకు సోపానాలు

