Kavitha: హరీశ్ రావును తిడితే అసెంబ్లీ సమావేశాలను వాకౌట్ చేయడం ఏంటని బీఆర్ఎస్ నేతలపై జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ప్రశ్నించారు. ఇదంతా బీఆర్ఎస్ డ్రామాగా పేర్కొన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ బాయ్‌కాట్ హరీశ్ రావు నిర్ణయమా, బీఆర్ఎస్ పెద్దల నిర్ణయమా అని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్ నిర్ణయమైతే చరిత్రలో క్షమించరాని తప్పు చేసినట్లేనని పేర్కొన్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వదిలి బయట సభలు పెట్టి ప్రజలకు వివరించడం ఏంటని ప్రశ్నిచారు. తెలంగాణకు 3 శాతం నీళ్ల వాటా తగ్గించే ఒప్పందంపై హరీశ్ రావు సంతకం చేశారా లేదా అంటూ కవిత నిలదీశారు.
Also Read: MLC Kavitha: గిరిజన తండాలో బస.. చెంచులతో మమేకమైన ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ నుంచి ఎవరూ స్పందించలేదు
జూరాల నుంచి శ్రీశైలానికి ఇన్ టేక్ పాయింట్‌ను ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలని అడిగారు. కేసీఆర్‌ను టెర్రరిస్ట్‌తో పోల్చితే తానే రియాక్ట్ అయ్యానని, బీఆర్ఎస్ నుంచి ఎవరూ స్పందించలేదని గుర్తు చేశారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డగోలు అబద్ధాలు చెప్పిందని మండిపడ్డారు. ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్ భద్రకు జాతీయ హోదాను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే కృష్ణా నది నీళ్ల అంశంపై చర్చించాలని అన్నారు. సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి అనుచరులు గుడులను, చెరువులను కూడా వదలలేదని కవిత ఆరోపించారు. హరీశ్ రావు, జగదీశ్ రెడ్డిపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదని పేర్కొన్నారు. అడ్డగోలుగా అవినీతి చేసిన వారిపైనే తాను మాట్లాడుతానని కవిత తెలిపారు.
Also Read: Kavitha: కవిత రాజీనామా వెనుక అసలు కారణమేంటి? మండలిలో బహిర్గతమయ్యే నిజాలు ఇవే?

