Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సామాయత్తమవుతోంది. ఇప్పటికే వార్డుల వారిగా ఓటర్ జాబితా ప్రకటన, మార్పులు చేర్పులు, అభ్యంతరాల స్వీకరణ చేపట్టింది. ఆయా డివిజన్లలో వార్డులు, పోలింగ్ కేంద్రాల వారిగా జాబితా, రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు తుది ఓటర్ జాబితా ప్రకటనకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. గురువారం జిల్లా కేంద్రంలోని గద్వాలతో పాటు ఐజ,వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీలలో ముసాయిదా ఓటర్ జాబితా ప్రదర్శించారు.
గద్వాల మున్సిపాలిటీలో పురుషులు 31, 724, స్త్రీలు 33,636, అలంపూర్ మున్సిపాలిటీలో పురుషులు 4,681, స్త్రీలు 4,940, ఐజ మున్సిపాలిటీలో పురుషులు 11, 233, స్త్రీలు 11,790 మంది ఉండగా వడ్డేపల్లి మున్సిపాలిటీలో పురుషులు 5,256 స్త్రీలు 5,347 మంది ఓటర్లు ఉన్నారు.ఈనెల 5న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు,6 న జిల్లా స్థాయి ఎన్నికల అధికారులతో సమావేశం, 10 న పోలింగ్ కేంద్రాల వారిగా ఓటర్ జాబితా వెల్లడి చేయనున్నారు. పట్టణాల్లో చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి.గత ఏడాదిగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో పురపాలిక సంఘాల్లో ఎన్నికల నిర్వహణకు మున్సిపల్ జనాభా వివరాలు సిద్ధం చేసి ఎన్నికల కమిషన్ కు నివేదించి త్వరలోనే ఎన్నికలను నిర్వహించనుంది.
Also Read: Pune Elections: బంపరాఫర్.. ఎన్నికల్లో ఓటు వేస్తే.. లగ్జరీ కారు, థాయ్‌లాండ్ ట్రిప్
ఆశావాహుల ప్రయత్నాలు
పట్టణాల్లో గత ఏడాదిగా ఎన్నికల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు.ప్రస్తుత తాజా మాజీ కౌన్సిలర్లు,గత ఎన్నికల్లో ఓటమి పాలైన వారు, ఇతర ఆశావాహులు పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.తమ వార్డుల్లో ప్రజలతో సంబంధాలు మెరుగుపరచుకుంటున్నారు. జిల్లా కేంద్రంతో పాటు నాలుగు మున్సిపాలిటీలలో రాజకీయ పార్టీల నాయకులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చేస్తున్నారు. వార్డు డివిజన్లలో రిజర్వేషన్లు అనుకూలిస్తే మహిళ జనరల్ స్థానాల్లో సైతం పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులపై జరగనున్న తరుణంలో కౌన్సిలర్ గా పోటీ కోసం అభ్యర్థులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్,ప్రతిపక్ష బి ఆర్ ఎస్, బిజెపి, వామపక్ష పార్టీల జిల్లా నాయకత్వం పట్టణాల్లో అధిక స్థానాలు గెలిచి తమ సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తున్నాయి.
జిల్లా కేంద్రంపై ప్రత్యేక దృష్టి
జిల్లా కేంద్రమైన గద్వాల ఎన్నికలపై రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. నాయకులు మొదటినుంచి మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా,చైర్మన్లుగా ఉన్నారు. దీంతో రానున్న ఎన్నికలలో పోటీ అధికంగా ఉండబోతోంది. మరోవైపు మున్సిపాలిటీలలో విలీనమైన గ్రామాలు సైతం ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పలువురు ఆశావాహులు డివిజన్ల వారిగా రానున్న ఎన్నికల్లో బరిలో ఉంటామని పలువురు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయితే పట్టణంలో రాజకీయ వేడి మరింత రాజుకోనుంది.
Also Read: Lok Sabha Elections: జహీరాబాద్‌లో లోక్‌సభ హీరో ఎవరో..?

