న్యూఢిల్లీ, స్వేచ్ఛ: భారతీయ అక్రమ వలసదారుల కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి అమానవీయకర రీతిలో మిలిటరీ విమానంలో తరలించడంపై కాంగ్రెస్ సారధ్యంలోని విపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. ఈ వ్యవహారంపై చర్చ చేపట్టాల్సిందేనని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు గురువారం పార్లమెంట్ (Parliament) వెలుపల నిరసన తెలిపాయి. ఈ ఆందోళనలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. పార్లమెంట్ (Parliament) మెయిన్ గేటు వద్ద పలు ప్లకార్డులను ప్రదర్శించారు. ‘వాళ్లు మనుషులు, ఖైదీలు కాదు’’ అంటూ అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయడానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అంతకుముందు ఈ వ్యవహారంపై చర్చించాలంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐ పార్టీలకు చెందిన ఎంపీలు ఉభయ సభల్లో నినాదాలు చేశారు. రూల్ 267 కింద విపక్ష ఎంపీలంతా కలిసి వాయిదా తీర్మానాన్ని అందజేశారు. ఈ నోటీసులు తిరస్కరణకు గురవ్వడంతో విపక్ష పార్టీల ఎంపీలు మరింత రెచ్చిపోయారు. తమ స్థానాల్లోనే నిలబడి బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు చేసిన వ్యాఖ్యలను రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ హరివంశ్ నారాయన్ సింగ్ తొలగించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి తరలించడం అమెరికా విదేశాంగ విధానమని వ్యాఖ్యానించారు. విదేశాలకు కూడా సొంత నియమ నిబంధనలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ అమెరికా అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ అత్యంత అవమానకరంగా ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ మరో ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ వలసదారులకు ఏకంగా 40 గంటలపాటు సంకెళ్లు వేశారని, కనీసం వాష్‌రూమ్‌కు వెళ్లడానికి కూడా చాలా ఇబ్బందిపడ్డారని విచారం వ్యక్తం చేశారు. అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ కనీసం మహిళలు, పిల్లలు కూడా అవమానాలకు గురికాకుండా చూడడంలో విదేశాంగశాఖ విఫలమైందని మండిపడ్డారు. ఈ అంశంపై ప్రభుత్వం నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు.