Musi Rejuvenation Project: మూసీ ప్రక్షాళన కచ్చితంగా చేసి తీరుతామని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. మార్చిలో మూసీ తొలి విడత పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశం సందర్భంగా శుక్రవారం సభలో జీరో అవర్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన మూసీ సుందీకరణ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గండిపేట్ నుంచి బాపూ ఘాట్ వరకు ఫస్ట్ ఫేజ్ లో 21 కి.మీ మేర మూసీని ప్రక్షాళన చేస్తామని సభకు ముఖ్యమంత్రి తెలియజేశారు.
రూ.4000 కోట్ల రుణం..
మూసీ ప్రక్షాళన పనులకు రుణం అందించేందుకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) ముందుకొచ్చినట్లు సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. రూ. 4000 కోట్లు రుణం అందించేందుకు అంగీకరించిందని చెప్పారు. నగరాల అభివృద్ధికి నదులు ఎంతగానో దోహదపడ్డాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. మూసా, ఈసా నదుల సంగమం వద్ద మహాత్మా గాంధీ అస్థికలు కలిపిన చోట బాపూ ఘాట్ నిర్మించారని తెలిపారు. 1908 లో నగరాన్ని వరద ముంచెత్తితే… వరద సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిజాం సర్కార్ నిర్మించిందని రేవంత్ గుర్తుచేశారు. శ్రీమంతుల ఫామ్ హౌస్ డ్రైనేజీతో ప్రస్తుతం అవి కలుషితం అవుతున్నట్లు సీఎం ఆరోపించారు. ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
మూసీలోకి కలుషితాలు..
ప్రపంచస్థాయి నగరాలన్నీ నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకున్నాయని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్ సబర్మతీ నది ప్రక్షాళన సమయంలో 60 వేల కుటుంబాలను తరలించినట్లు పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో గంగా నది ప్రక్షాళన చేసి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారని చెప్పారు. బీజేపీ నాయకులు వాటిని అభివృద్ధి మంత్రంగా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మూసీ కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారన్న సీఎం.. కంపెనీల కలుషితాల నుంచి జంతువుల కళేబరాల వరకు మూసీలో కలుస్తున్నాయని తెలిపారు. మూసీ పరీవాహక ప్రాంత మహిళలు గర్భం దాల్చలేకపోతున్నారని వైద్యులు చెప్పిన విషయాన్ని సీఎం సభ దృష్టికి తీసుకొచ్చారు.
మూసీకి గోదావరి జలాలు
ప్రపంచ నగరాలు అభివృద్ధి చెందుతున్న విధానాలను చూశాక మూసీలో శుద్ధమైన నీరు ప్రవహించాల్సిందేనని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ‘బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ రెండు నదులు కలిసే చోట V షేప్ లో అభివృద్ధి జరుగుతోంది. గోదావరి జలాలను తరలించి మూసీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తున్నాం. 20 టీఎంసీలలలో 15 టీఎంసీలు తాగు నీటి అవసరాలకు, 5 టీఎంసీలు మూసీలో నిరంతరం శుద్ధమైన నీరు పాటించేందుకు ఉపయోగించాలని భావిస్తున్నాం. మూడు నదుల సంగమంగా బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ను అభివృద్ధి చేయబోతున్నాం’ అని సీఎం రేవంత్ తెలిపారు.
55 కి.మీ ఎలివేటెడ్ కారిడార్
ఈ ఏడాది మార్చి 31 లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు వేసి మూసీని అభివృద్ధి చేయాలను భావిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గాంధీ సరోవర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించిందన్న రేవంత్.. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఓల్డ్ సిటీని మేం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదన్న రేవంత్.. ఓల్డ్ సిటీ ఒరిజినల్ సిటీ అంటూ కితాబిచ్చారు. హైదరాబాద్ ను ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కొంతమంది నన్ను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారన్న సీఎం.. రియల్ ఎస్టేట్ కూడా ఒక ఇండస్ట్రీ అని గుర్తు చేశారు. హైటెక్ సిటీ నిర్మించాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి విమర్శలే చేశారని పేర్కొన్నారు.
Also Read: Telangana Assembly: శాసనసభలో గందరగోళం.. యూరియాపై బీఆర్ఎస్ నిరసన.. మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
నాపై విషం కక్కుతారా: సీఎం రేవంత్
మూసీ కాలుష్యం కంటే కొందరు మనుషుల కడుపులో ఉన్న విషం అత్యంత ప్రమాదకరమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తాను సభలో వివరాలు చెబుతుంటే ఎందుకు విషం కక్కుతున్నారని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన చేయాలని బీఆరెస్ ఎమ్మెల్యేలు సైతం కోరుకుంటున్నారని చురకలు అంటించారు. డీపీఆర్ సిద్దమయ్యాక అందరి సలహాలు, సూచనలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలకు నా సూచన. మీ నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కావాలో చెప్పండి. పేదలకు మంచి ఇండ్లు కట్టించి వారికి మెరుగైన వసతులు కల్పిద్దాం’ అని పేర్కొన్నారు.
మూసీలో ఉన్న కాలుష్యం కంటే బీఆర్ఎస్ నేతల కడుపుల్లోనే ఎక్కువ విషం ఉంది
వాళ్ల కళ్లకు గనుక ఏదైనా శక్తి ఉండి ఎవరి వైపు అయినా చూస్తే కాలి బూడిదవుతారు
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి pic.twitter.com/rtQ1QWhyv4
— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2026

