నిజామాబాద్, స్వేచ్ఛ : నిజామాబాద్ లో ఇంటి ముందర పార్క్ చేసిన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో (Electric Passenger Auto) దగ్ధమైన ఘటన బుధవారం రాత్రి నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..నగరంలోని ధర్మపురి హిల్స్ ప్రాంతానికి చెందిన ఎండీ ముసొద్దీన్ అనే వ్యక్తి ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేశాడు. ప్రతిరోజు మాదిరిగానే ఆయన బుధవారం రాత్రి ఇంటి ముందు ఆటో నిలిపి చార్జింగ్ పెట్టాడు. చార్జింగ్ పెట్టిన కొద్ది సమయానికి ఆటోలోంచి మంటలు రావడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఆయనకు సమాచారం ఇచ్చారు. ఆటో యజమాని బయటికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికి అప్పటికే ఆటో పూర్తిగా దగ్ధమైపోయింది. ఆటో దగ్ధానికి బ్యాటరీ ఓవర్ చార్జింగ్ కావడమా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా తెలియాల్సి ఉంది.