Harish Rao: కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులను చకచకా విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, చిన్న కాంట్రాక్టర్ల సమస్యలు కనిపించడం లేదా? అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao) నిప్పులు చెరిగారు. ‘కమిషన్లు రావు అన్న ఉద్దేశంతోనే బిల్లులు ఆపేస్తున్నారా?’ అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం హైదరాబాద్‌లో ‘మన ఊరు-మన బడి’ కాంట్రాక్టర్లు హరీశ్ రావును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అప్పులు తెచ్చి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Road Widening: ఏండ్లు గడుస్తున్నా రోడ్డు విస్తరణకు కలగని మోక్షం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం..!
లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న కేసీఆర్ లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 512 కోట్ల బిల్లులు ‘రెడీ ఫర్ పేమెంట్’ ఉన్నప్పటికీ ప్రభుత్వం చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. ఒకవైపు బ్యాంకు వడ్డీలు, మరోవైపు కార్మికుల జీతాలు చెల్లించలేక కాంట్రాక్టర్లు ఆత్మహత్యల దిశగా వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకులాల పిల్లలకు సరిగ్గా అన్నం కూడా పెట్టలేని చేతగాని సర్కారు అని తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాంట్రాక్టర్ల బకాయిలను విడుదల చేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, కాంట్రాక్టర్లకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని ఆయన భరోసా ఇచ్చారు. అభివృద్ధి పనులు చేసిన వారికి సకాలంలో చెల్లింపులు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి దుయ్యబట్టారు.
Also Read: Fan Wars: ‘జల్సా’ రీ రిలీజ్.. థియేటర్‌లో మహేష్ అభిమానిపై పవన్ ఫ్యాన్స్ దాడి!

