అమరావతి, స్వేచ్ఛ: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్దిరోజులుగా సేనాని వైరల్ ఫీవర్, స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నట్టు డిప్యూటీ సీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది. స్పాండిలైటిస్ సమస్య ఎక్కువైందని, వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకొంటున్నారని జనసేన ఎక్స్ వేదికగా తెలిపింది. కొద్దిరోజులపాటు బయటికి రాలేరని, కేబినెట్ సమావేశానికి కూడా హాజరుకాలేరని కూడా స్పష్టం చేసింది. వాస్తవానికి ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ నాటి నుంచే పవన్ స్పాండిలైటిస్ ఇబ్బందితో వెళ్లలేదు. సమస్య మరింత జటిలం కావచ్చని డాక్టర్లు సూచనతో అప్పట్నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు.
Also Read : TTD | కొండపై అన్యమతస్థులు అవుట్.. ఈవో కీలక ఉత్తర్వులు
దక్షిణాది యాత్రకు బ్రేక్
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆధ్యాత్మిక యాత్ర నిర్వహించాలని భావించారు. దక్షిణాదిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలని నిర్ణయించారు కానీ జ్వరం, స్పాండిలైటిస్‌తో ఈ యాత్రకు బ్రేక్ పడింది. ప్రధానంగా తమిళనాడు, కేరళల్లోని అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించాలని రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారు. తొలుత కేరళ, ఆ తర్వాత తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలు సందర్శించి, ప్రెస్ మీట్లు కూడా నిర్వహిస్తారని ప్రచారం జరిగింది.
దీంతో ఈ దక్షిణాది టూర్ రాజకీయం అవుతుందని, గతంలో సనాతన ధర్మంపై మాట్లాడినప్పుడు కూడా దక్షిణాదిలో హిందూత్వ లీడర్‌గా ఆవిర్భవించేందుకు అవసరమైన కార్యాచరణ ఖరారు చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పవన్‌కు ఆధ్యాత్మిక చింతన మెండు. హిందూ ధార్మిక విశ్వాసాల పట్ల చాలా శ్రద్ధగా ఉంటారనేది అభిమానులకు తెలుసు. యజ్ఞయాగాది క్రతువులనను కూడా స్వయంగా చేయిస్తుంటారు. ఇందులో భాగంగానే దక్షిణాది టూర్ అని జనసేన నేతలు స్పష్టం చేశారు.