Basti Dawakhana: గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సామాన్యుడికి చేరువైన ‘బస్తీ దవాఖానా’ల సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మందుల సరఫరాలో సరికొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకురానున్నది. ఇకపై సెంట్రల్ మెడిసిన్ స్టోర్ నుండి నేరుగా ప్రత్యేక వాహనాల్లో మందులు బస్తీ దవాఖానా గడప తొక్కనున్నాయి. వారానికి ఓ సారి రూట్ మ్యాప్ ను ఫిక్స్ చేసి, సమీపంలోని బస్తీ దవాఖానలను అనుసంధానిస్తూ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ చేయనున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఆదేశాల మేరకు ఆఫీసర్లు కొత్త సిస్టంను పరిశీలిస్తున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే పేషెంట్లకు సకాలంలో మందుల లభించడమే కాకుండా, వైద్యసేవల్లోనూ మార్పులు కనిపించనున్నాయి. తద్వారా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఇబ్బందులు తప్పనున్నాయి.
మందులకు ఇక్కట్లు..
ప్రస్తుతం బస్తీ దవాఖానాల్లో రవాణా సౌకర్యం లేక, సిబ్బంది కొరత వల్ల అవసరమైన మందులు సకాలంలో అందడం లేదు. ప్రైవేట్ వాహనాల్లో మందులు సప్లై వలన సేప్టీ మెజర్స్ లోనూ సమస్యలు వస్తున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఫలితంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు కావాల్సిన పేదలు ప్రైవేట్ మెడికల్ షాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. మరోవైపు బస్తీ దవాఖానల్లో స్టాక్ అయిపోతే మెడికల్ ఆఫీసర్లు స్వయంగా వెళ్ళి డీఎంహెచ్‌ఓ ఆఫీసులు, నిర్దేశిత ప్రభుత్వ స్టోర్స్ నుంచి మందులు తీసుకురావాల్సి వస్తున్నది. దీని వలన డాక్టర్లు రోగులకు కేటాయించే సమయం తగ్గుతోంది. తద్వారా పేషెంట్లకు వైద్య సేవలు అందించడం లో జాప్యం జరుగుతుంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే సమయం ఆదాతో పాటు పేషెంట్లకు సకాలంలో మందులు లభిస్తాయి.
Also Read: KTR: పాలమూరు పై నిర్లక్ష్యం ఎందుకు?.. ఎన్ని రోజులు కాలం వెళ్ళదీస్తారు: కేటీఆర్
డిజిటల్ ట్రాకింగ్..
ఇక ఏ దవాఖానాలో ఏ మందులు నిల్వ ఉన్నాయి? స్టాక్ ఎంత ఉన్నది? ఎన్ని రోజులకు సరిపోతుంది? అనే అంశాలను ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ ద్వారా పర్యవేక్షిస్తారు. స్టాక్ తగ్గగానే ఆటోమేటిక్‌గా అలర్ట్ వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేశారు. హైదరాబాద్‌లోని సుమారు 300కు పైగా బస్తీ దవాఖానల్లో కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే మందుల కొరతకు చెక్ పడనున్నది .ఇన్సులిన్, యాంటీ బయాటిక్స్, జ్వరం బిళ్లలు వంటి నిత్యం అవసరమైన మందులు ఎప్పుడూ అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్రభుత్వ మందులు సకాలంలో దొరకడం వల్ల పేద ప్రజలకు నెలకు వందల రూపాయల ఖర్చు భారం తప్పనున్నది.
Also Read: Santhakumari: మోహన్‌లాల్ తల్లి శాంతకుమారి కన్నుమూత

