Santhakumari: మలయాళ చిత్రసీమలో తన నటనతో ఒక శకాన్ని సృష్టించిన కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన ప్రాణంగా ప్రేమించే మాతృమూర్తి (Mohanlal Mother) శాంతకుమారి (90) మంగళవారం కొచ్చిలోని ఎలమక్కర నివాసంలో కన్నుమూశారు. కేవలం ఒక నటుడి తల్లిగానే కాకుండా, క్రమశిక్షణ, ప్రేమ, పట్టుదలకు ప్రతిరూపంగా నిలిచిన ఆమె ప్రయాణం ఎందరికో ఆదర్శం. శాంతకుమారి మూలతః పతనంతిట్ట జిల్లాలోని ఎలంతూర్ గ్రామానికి చెందినవారు. ఆమె భర్త విశ్వనాథన్ నాయర్ కేరళ ప్రభుత్వ లా సెక్రటరీగా పనిచేసేవారు. ఆయన ఉద్యోగ రీత్యా వారి కుటుంబం తిరువనంతపురానికి మారింది. అక్కడే లాల్ బాల్యం, విద్యాభ్యాసం సాగింది. 2000వ సంవత్సరంలో తన పెద్ద కుమారుడు ప్యారేలాల్ మరణం ఆమెను తీవ్రంగా కలిచివేసినా, గుండె నిబ్బరంతో కుటుంబాన్ని నడిపించారు. కొన్నేళ్ల క్రితం పక్షవాతానికి గురైన తల్లిని, మోహన్‌లాల్ స్వయంగా కొచ్చికి తీసుకొచ్చి తన దగ్గరే ఉంచుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు.
Also Read- Allu Aravind: కొడుకుకి సక్సెస్ వస్తే వచ్చే ఆనందం.. నాకంటే బాగా ఎవరికీ తెలియదు!
90 ఏళ్ల పరిపూర్ణ జీవితం
ఈ ఏడాది 10 ఆగస్టు, 2025న శాంతకుమారి (Santhakumari) తన 90వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆ సమయంలో మోహన్‌లాల్ తన తల్లితో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వయసు పైబడినప్పటికీ, కొడుకు సాధించే ప్రతి విజయం ఆమెకు ఒక టానిక్‌లా పనిచేసేది. మోహన్‌లాల్ జీవితంలో అమ్మ స్థానం వెలకట్టలేనిది. సినీ ప్రపంచంలో ఎన్ని శిఖరాలు అధిరోహించినా, అమ్మ ముందు ఆయన ఎప్పుడూ చిన్న పిల్లోడే. భారత చిత్రసీమలో అత్యున్నతమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తర్వాత, మోహన్‌లాల్ మరెక్కడికీ వెళ్లకుండా నేరుగా కొచ్చి చేరుకుని, ఆ అవార్డును తన తల్లి పాదాల చెంత ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు.
అమ్మ పుణ్యమే
2020 లాక్‌డౌన్ సమయంలో, 60వ పడిలోకి అడుగుపెట్టిన లాల్, నాలుగు దశాబ్దాల బిజీ లైఫ్ తర్వాత అమ్మతో గడిపే అద్భుతమైన సమయం దొరికిందని ఎంతో భావోద్వేగంతో పంచుకున్నారు. ఈ ఏడాది మదర్స్ డే రోజున కూడా ఆమెతో ఉన్న పాత జ్ఞాపకాన్ని పంచుకుంటూ తన ప్రేమానురాగాలను చాటుకున్నారు. ఒక తల్లిగా ఆమె బిడ్డను నటుడిని చేయడమే కాదు, ఒక సంస్కారవంతుడైన మనిషిగా తీర్చిదిద్దారు. మోహన్‌లాల్ ఎప్పుడూ చెప్పే మాట ‘నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది అమ్మ పుణ్యమే’ అని. నేడు ఆమె భౌతికంగా దూరమైనా, ఆయన ప్రతి విజయంలోనూ ఆమె ఆశీస్సులు తోడుంటాయి. శాంతకుమారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆ కుటుంబానికి సెలబ్రిటీలందరూ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
Amma ❤️ pic.twitter.com/Q6vsqmCemV
— Mohanlal (@Mohanlal) May 11, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

