నిజామాబాద్, స్వేచ్ఛ: ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad)జిల్లాలో నవజాత శిశు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ఆస్పత్రుల్లో గతేడాది 200 మందికి పైగా నవజాత శిశువులు మృతి చెందినట్లు ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి. ఒక్క నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో 2024లో 28 రోజుల్లోపు చిన్నారులు 152 మంది మృతి చెందగా.. కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో 50 మందికి పైగా నవజాత శిశువులు మృతిచెందారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
తక్కువ బరువుతో పుట్టడం, పౌష్టికాహారలోపం, గర్భిణులు తీవ్ర ఒత్తిడికి గురవ్వడం వల్ల పుట్టిన పిల్లలు నెల వ్యవధిలో మృతి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నిర్మల్, కామారాడ్డి, ఆదిలాబాద్, మహారాష్ట్రలో పుట్టిన పిల్లలను అనారోగ్య కారణాల వల్ల అన్ని ఆస్పత్రుల చుట్టూ తిప్పి.. చివరి క్షణాల్లో జిల్లా ఆస్పత్రికి తేవడం వల్ల అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతి చెందుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో నెలకు 120 నుంచి 130 మంది నవజాత శిశువులకు చికిత్స అందిస్తున్నామని వారిలో 40 శాతం నెలలు నిండని శిశువులు, బరువు తక్కువ శిశువులు ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు.
కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు..
నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఆస్పత్రిలో.. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి నెల రోజుల్లోపు శిశువులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేలా సౌకర్యాలు ఉన్నాయి. ఎస్‌ఎన్‌సీయూ విభాగంలో 12 మంది పిల్లల వైద్యులతో పాటు మరో నలుగురు ప్రత్యేక వైద్యులు ఉన్నారు. 15 వార్మర్లు, ఇంక్యూబేటర్లు, ఫొటో థెరపి, వెంటిలేటర్లతో పాటు అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. 700 గ్రాములతో పుట్టిన బిడ్డలను సైతం కాపాడిన ఘనత ఇక్కడి వైద్యులకు ఉంది. అయితే అన్ని సౌకర్యాలు ఉన్నా.. చిన్నారులు మృతి చెందుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
రాష్ట్ర సగటుకు సమానంగా ఇక్కడ మరణాలు ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నా.. నవజాత శిశు మరణాలు తగ్గించేలా చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తున్నది. కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలోనూ అప్పుడే పుట్టిన శిశువులు మృతి చెందుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుల బంధువులు చెబుతున్నారు. పుట్టిన ప్రతి వేయి మందిలో రాష్ట్రంలో 10 మంది చిన్నారులు, జిల్లాలో 15 మంది చిన్నారులు మృతి చెందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో అరుదైన వ్యాధుల బారిన పడి మృతి చెందుతున్నవారూ ఉంటున్నారు.