Future City: ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై జీహెచ్ఎంసీ పరిధిలో నలుగురు కమిషనర్లు శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నారు.
సీఎం విజన్‌కు తగ్గట్టుగా..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అని మూడు భాగాలుగా విభజించి, ప్రతీ ప్రాంతానికి ఒక ప్రత్యేక వ్యూహం, ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఓఆర్ఆర్ లోపలి 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలుపుతూ చట్టపరమైన మార్పులు చేసింది. ఈ వ్యూహం ద్వారా ఈ ప్రాంతంలో ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగడానికి అవకాశం ఉన్నది. జీహెచ్ఎంసీ ప్రాంతాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్ వ్యవస్థీకరించారు. ఇదే విధంగా ఇతర శాఖలను పునర్ వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు మెరుగైన సేవలు, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో భాగంగా పోలీస్ వ్యవస్థను నాలుగు కమిషనరేట్లుగా విభజిస్తూ నిర్ణయం తీసుకున్నది.
ఇకపై 4 కమిషనరేట్లు
ఇప్పటికే ఉన్న 3 కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరిస్తూ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్ పోర్టు, బుద్వేల్ హైకోర్టు లాంటి కీలక ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ ప్రాంతాలు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్ గూడ, మాదాపూర్, రాయదుర్గం, పారిశ్రామిక ప్రాంతాలైన పటాన్ చెరు, జీనోమ్ వ్యాలీ, ఆర్‌సీ పురం, అమీన్ పూర్ తదితర ప్రాంతాలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉండనున్నాయి.
Also Read: Mahabubabad News: ఎవరి మాటా వినడు.. సీతయ్యలా ప్రవర్తిస్తున్న మండల వ్యవసాయ అధికారి
మల్కాజిగిరిగా మార్పు
రాచకొండ కమిషనరేట్‌ను పునర్ వ్యవస్థీకరించి మల్కాజిగిరి పేరుతో కొత్త కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. కీసర, శామీర్ పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ కోసం సీఎం ఆలోచనలకు తగ్గట్టు కొత్త కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్ పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాలు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 4 కమిషనరేట్లకు పోలీస్ కమిషనర్లను, యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఐపీఎస్‌ల బదిలీలు
రాచకొండ కమిషనర్ సుధీర్ బాబును ఫ్యూచర్ సిటీ సీపీగా నియమించారు. సైబరాబాద్ సీపీగా ఉన్న అవినాష్ మహంతిని మల్కాజిగిరి సీపీగా పోస్టింగ్ ఇచ్చారు. ఇక, ఐజీ రమేష్‌ను సైబరాబాద్ సీపీగా నియమించారు. యాదాద్రి భువనగిరి డీసీపీ అక్షాంష్ యాదవ్‌కు జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: KTR: పాలమూరు పై నిర్లక్ష్యం ఎందుకు?.. ఎన్ని రోజులు కాలం వెళ్ళదీస్తారు: కేటీఆర్

