Crime Report 2025: 2025 ఏడాదిలో విశాఖపట్నంలో చోటుచేసుకున్న నేరాల వార్షిక నివేదికను సిటీ పోలీసు కమీషనర్ శంఖబ్రత బాగ్చి (Shankha Bratha Bagchi) విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం హత్యలు పెరిగిపోయాయని స్పష్టం చేశారు. హత్యలు గతేడాది 24 జరిగితే ఈ ఏడాది 35 నమోదు అయ్యాయని పేర్కొన్నారు. హత్యాచారాలు గత ఏడాది 126 జరిగితే ఈసారి 63కి తగ్గాయన్నారు. అత్యాచార కేసుల్లో 50% మేర తగ్గుదల చోటుచేసుకున్నట్లు చెప్పారు.
మరోవైపు సైబర్ క్రైమ్ విభాగంలో 1020 కేసులను పరిష్కరించినట్లు విశాఖ సీపీ తెలియజేశారు. ఇప్పటి వరకు లోన్ అప్ ద్వారా 126 మంది బాధితులకు రూ. 56 లక్షలు రికవరీ చేసి అందించినట్లు తెలిపారు. నగరంలో 4,959 కేసులు నమోదు కాగా.. వాటి తాలుకూ బాధితులకు రూ.10.5 కోట్లు రికవరీ చేసి తిరిగిచ్చినట్లు చెప్పారు. మరోవైపు విశాఖలో గంజాయి నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు సీపీ స్పష్టం చేశారు. ఈ ఏడాది గంజాయిపై 40 కేసులు నమోదు చేశామని 10 కిలోల 147 గ్రాముల గంజాయిని సీజ్ చేశామని చెప్పారు. అలాగే 19.2 లీటర్ల యష్ ఆయిల్ పట్టుకున్నామని వివరించారు.
Also Read: Delhi Shopping Mall: మూతపడ్డ మాల్‌లోకి వెళ్లిన ఫ్రెండ్స్.. శవంగా తిరిగొచ్చిన టీనేజర్.. అసలేం జరిగింది?
మరోవైపు నగరంలో 13,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వైజాగ్ సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. నగర ప్రజల భాగస్వామ్యంతో వీటి ఏర్పాటు జరిగినట్లు చెప్పారు. నగరంలో 15 డ్రోన్లు.. 22 పోలీసు స్టేషన్ల పరిధిలో పని చేస్తున్నట్లు సీపీ చెప్పారు. డ్రోన్ సాయంతో 453 కేసులు బుక్ చేసినట్లు స్పష్టం చేశారు. మరోవైపు రూ.17 కోట్ల మేర ట్రాఫిక్ ఉల్లంఘనల చలాన్లు వసూలు చేసినట్లు బాగ్చీ తెలిపారు. సుమారు లక్షమంది లైసెన్స్ ను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నగరంలోని 2,576 మంది పోలీసు సిబ్బందికి రూ.30 లక్షల చొప్పున బీమా చేయించినట్లు నగర సీపీ చెప్పుకొచ్చారు. మరోవైపు కొత్త ఏడాది నుంచి విశాఖలో ఏఐ ఆధారిత ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీపీ తెలియజేశారు.

