iBomma Ravi: ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి (iBomma Ravi) పోలీస్ కస్టడీ సోమవారంతో ముగియనుంది. కాగా, గతంలో రవి ప్రహ్లాద్ వెల్లెల పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రహ్లాద్‌ను (Prahlad interrogation) సైబర్ క్రైం పోలీసులు పిలిపించి విచారించారు. ఈ విచారణలో రవి ఎవరో తనకు తెలియదని అతను చెప్పటం గమనార్హం. దమ్ముంటే పట్టుకోండి అంటూ ఛాలెంజ్ విసిరిన రవిని కొన్ని రోజుల క్రితం సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నాలుగు కేసుల్లో అతన్ని కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న సైబర్ క్రైం పోలీసులు ప్రస్తుతం రవిని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రహ్లాద్ పేర అతను పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్టుగా వెల్లడైంది.
Also Read- Thalapathy Vijay: సినిమాలకు గుడ్‌బై.. అధికారికంగా ప్రకటించిన దళపతి విజయ్
ప్రహ్లాద్‌కు డాక్యుమెంట్లు తస్కరించిన రవి
గతంలో ప్రహ్లాద్ తన రూమ్ మేట్ అని చెప్పిన రవి అప్పుడే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్టుగా చెప్పాడు. ఈ క్రమంలో పోలీసులు ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ప్రహ్లాద్‌ను హైదరాబాద్ పిలిపించారు. రవితోపాటు కూర్చోబెట్టి విచారణ జరిపారు. దీంట్లో అసలు రవి ఎవరో తనకు తెలియదని, తన పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్టు తెలిసి షాక్ అయ్యానని ప్రహ్లాద్ చెప్పినట్టుగా తెలిసింది. తాను బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నానని అన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ప్రహ్లాద్‌కు చెందిన డాక్యుమెంట్లను రవి తస్కరించి వాటి సాయంతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్టుగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇక, సోమవారంతో కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపించి అనంతరం కోర్టులో హాజరు పరచనున్నారు. ఆ తరువాత చెంచల్ గూడ జైలుకు రిమాండ్ చేస్తారు.
Also Read- Rare Frame: సల్మాన్ 60వ బర్త్‌డే బాస్‌లో దిగ్గజాలు.. ఫొటో వైరల్!
బెయిల్ పిటిషన్‌ను తిరస్కరణ
ఇప్పటికే రవిని రెండుసార్లు కస్టడీకి తీసుకున్న సైబర్ క్రైం పోలీసులు విచారణ జరిపారు. ఈ విచారణలో రవి ఎలాంటి కీలక వివరాలు వెల్లడించలేదు. దాంతో పోలీసులు ఇటీవల రవిపై మరో నాలుగు కేసులు ఉన్నాయని, వాటిలో విచారణ చేసేందుకు కస్టడీకి అనుమతించాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. అదే సమయంలో రవి బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. రవి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఇప్పటికే రవిని రెండుసార్లు కస్టడీకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారని చెప్పారు. విచారణ పేర రవిని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. కస్టడీకి అనుమతించకుండా బెయిల్ మంజూరు చేయాలని అడిగారు. కాగా, రవికి బెయిల్ మంజూరు చేస్తే కేసును పక్కదారి పట్టించే అవకాశాలు ఉన్నాయంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. ఈ నేపథ్యంలో కోర్టు రవి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించి, అతనిపై ఉన్న నాలుగు కేసుల్లో కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ విచారణే సోమవారంతో ముగియనుంది. మరి ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటికి వస్తాయో వేచి చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

