Etela Rajender: 24 గంటలు ప్రజాసేవలో ఉంటాను
సమస్య విని వదిలివేసే వాడిని కాదు
పరిష్కారం కోసం కృషి చేసేవాడిని
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తాను సీరియస్ పొలిటీషియన్ అని, 24 గంటలు ప్రజాసేవలో ఉంటానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) తెలిపారు. హైదరాబాద్ బోయినపల్లిలో ఆదివారం నిర్వహించిన నార్త్ ఇండియన్ అసోసియేషన్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. తాను సమస్య విని వదిలివేసే వాడిని కాదని, పరిష్కారం కోసం కృషి చేసేవాడినని చెప్పారు. వేర్వేరు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చారని, కరోనా సమయంలో 16 లక్షల మంది ఇక్కడి నుంచి వెళ్లినప్పుడు ఎంతమంది ఇక్కడ ఉన్నారనేది తెలిసిందన్నారు. హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ అని, ముఖ్యంగా మల్కాజిగిరి మినీ ఇండియా అని వివరించారు. అన్ని రాష్ట్రాల వారు ఇక్కడ ఉంటున్నారన్నారు. కొత్తగా చాలా కాలనీలు ఇక్కడ ఏర్పడ్డాయని, వీటిలో మంచినీరు, డ్రైనేజీ చాలా సమస్యలున్నాయన్నారు.
వాటిని పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ఆయన విమర్శించారు. స్థానిక సమస్యలు ఏమున్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలను కుటుంబ సభ్యుల్లా ఎవరు చూస్తారో వారికే ప్రజల ఆశీర్వాదం లభిస్తుందన్నారు. ఎస్ఐఆర్, ఈవీఎం వల్ల ఓడిపోయామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, వారు గెలిస్తే ఒప్పు.. ఓడిపోతే తప్పు జరిగినట్టా? అని ఈటల ప్రశ్నించారు. ప్రజలతో మమేకమవ్వాలని, ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తనకు వేరే వ్యాపారం లేదని, 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉండి పని చేసి పెడతానని వివరించారు. త్వరలో అన్ని రాష్ట్రాల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. అనంతరం ప్రధాని మోడీ మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్ ను వీక్షించారు.
Read Also- Assembly Session KCR: అసెంబ్లీకి కేసీఆర్!.. ఎర్రవెల్లి నుంచి నందినగర్ చేరుకున్న మాజీ సీఎం
సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించేలా చూడండి
ఎంపీ డీకే అరుణకు బంజారా నాయకుల వినతి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: సేవాలాల్ మహారాజ్ జయంతిని(ఫిబ్రవరి 15) కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి దేశవ్యాప్తంగా నిర్వహించాలని పాలమూరు ఎంపీ డీకే అరుణకు బంజారా నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో ఆదివారం మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్ ఆధ్వర్యంలో బంజారా సంఘం నాయకులు ఆమెను కలిశారు. భారతదేశంలో 12 కోట్ల మంది బంజారాలు మాట్లాడే గోర్బోలి భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని, అలాగే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడి ఫిబ్రవరి 15న సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రకటించి నిర్వహించేలా కృషిచేయాలని ఆమెకు విజ్ఞప్తిచేశారు.
ఇప్పటికే ఎంపీలు ఈటల రాజేందర్, గోడెం నగేష్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కలిసి ఈ అంశంపై విజ్ఞప్తిచేశామని సంఘం నాయకులు తెలిపారు. డీకే అరుణను కలిసిన వారిలో మాజీ అడిషనల్ డీజీపీ డీటీ నాయక్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సోమ్ లాల్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ మోహన్ సింగ్, మాజీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాండురంగ నాయక్, హైకోర్టు న్యాయవాది జోగురామ్, సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పీహెచ్ నాయక్, బంజారా, సుగాలి, లంబాడి వెల్ఫేర్ ట్రస్ట్ ఫౌండర్ శ్రీమన్నారాయణ, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్యదర్శి హము నాయక్, ఎన్పీడీసీఎల్ ఎస్టీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడు రవీందర్ నాయక్, ఏఐబీఎస్ఎస్ నాయకులు విష్ణు నాయక్, తేజావత్ భీముడు నాయక్, అజ్మీర శ్రీరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Also- Home Remedies: కడుపు నొప్పితో బాధపడుతున్నారా.. అయితే, ఈ సహజ చిట్కాలతో చెక్ పెట్టేయండి!

