Indian Army Alert: జమ్మూ కశ్మీర్‌కు (Jammu Kashmir) మరోసారి ఉగ్ర ముప్పు పొంచివున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. జమ్మూ ప్రాంతంలో 30 మందికి పైగా పాకిస్థానీ ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ చేశాయి. దీంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. ఉగ్రవాదుల జాడను పసిగట్టే వేట మొదలుపెట్టారు. మరోవైపు, శీతాకాలం కావడంతో అత్యంత కఠినమైన 40 రోజుల శీతల వాతావరణం నేపథ్యంలో ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు అతి సంక్లిష్టమైన ప్రాంతాల్లో కూడా ఇండియన్ ఆర్మీ గస్తీని (Indian Army Alert) పెంచింది.
శీతాకాలం కావడంతో జమ్మూ కశ్మీర్‌లో విపరీతంగా మంచు కురుస్తోంది. పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలోని పర్వతాలపై దట్టంగా మంచు పేరుకుపోయింది. అయితే, అక్కడి ఈ కఠిన పరిస్థితులను అనుకూలంగా చేసుకొని భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అలాంటి ఆటలు సాగనివ్వకుండా ఆర్మీ ముమ్మరంగా గస్తీ కాస్తోంది. ఉగ్రవాదులు వాతావరణ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోకుండా భారత సైన్యం ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఈ మేరకు కీలకమైన ‘చిల్లై కలాన్’ (Chillai Kalan) ప్రాంతంలో పహారాను పెంచింది.
Read Also- Dhruv Rathee: యూట్యూబర్ ధృవ్ రాఠీ వీడియోలో జాన్వీ కపూర్ ఫోటో.. సోషల్ మీడియా వార్..
మరో చోటుకు ఉగ్రవాదులు!
భారత సైన్యం నిరంతర సైనిక దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదులు రూటు మార్చినట్టుగా రక్షణ, నిఘా వర్గాల సమాచారం. కిష్త్వార్, దోడా ప్రాంతాలలో పౌర సంచారం తక్కువగా ఉండే మధ్య, ఎగువ పర్వత ప్రాంతాల వైపు తరలిపోయినట్టు గుర్తించారు. సాధారణంగా అయితే, శీతాకాలంలో గస్తీ కార్యకలాపాలు తక్కువగా ఉంటాయని భావిస్తుంటారు. ఆ సమయంలో పట్టుబడకుండా తప్పించుకోవడానికి, తిరిగి యాక్టివ్ కావాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది. కాగా, శీతాకాలంలో గస్తీ తక్కువగా ఉంటుందనే భావనలో నిజం లేదని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. విపరీతమైన మంచు కురుస్తున్నప్పటికీ డిసెంబర్ 21న ఎత్తైన ప్రాంతాలలో సైతం సైన్యం పరిధిని విస్తరించినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోయినప్పటికీ, ఉగ్రవాద స్థావరాలపై నిరంతర నిఘా కొనసాగించడానికి ఫార్వర్డ్ బేస్‌లను, తాత్కాలిక నిఘా పోస్టులను ఏర్పాటు చేసినట్టు వివరించారు.
అడవులు, లోయల్లోనూ గాలింపు
ఉగ్రవాదులు ఎక్కడా సురక్షితంగా దాక్కోకుండా అడవులు, లోయలు, ఎత్తైన కొండ ప్రాంతాలలో కూడా ఇండియన్ ఆర్మీ క్రమం తప్పకుండా గాలింపు చర్యలు చేపడుతోందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాద మూకలను నివాస యోగ్యం కాని ప్రాంతాలకే పరిమితం చేయడం, వారి సరఫరా వ్యవస్థను దెబ్బకొట్టడం, జనావాసాల్లోకి రాకుండా అడ్డుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని అధికారులు వివరించారు.
ఉగ్రవాదులను ఎట్టిపరిస్థితుల్లోనూ సరిహద్దు దాటకుండా నిలువరించేందుకు జమ్మూ కాశ్మీర్ పోలీస్, సీఆర్‌పీఎఫ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), ఫారెస్ట్ గార్డ్స్, విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ సమన్వయంతో పనిచేస్తున్నారు. ఉగ్రవాదుల కదలికలను గుర్తింపు, అవసరమైతే లక్షిత దాడులు చేపట్టేందుకు నిఘా సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటున్నారు. కాగా, జమ్ము కశ్మీర్ స్థానికుల మద్దతు తగ్గిపోవడం, దిగువ ప్రాంతాలలో నిఘా పెరగడంతో ఉగ్రవాద మూకలు ఒంటరి అయ్యాయని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. ఆహారం, ఆశ్రయం విషయమై గ్రామస్థులపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ, వారికి పెద్దగా సాయం లభించడం లేదని నిఘా వర్గాలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

