MP Raghunandan Rao: ప్రధాని మోడీ ఢిల్లీలో తెలంగాణ ఎంపీలతో సమావేశమై చెప్పిన మాటలు నిజమని, ఆయన ఒక్కసారి మజ్లిస్ తో కంపేర్ చేయడం అనేది కూడా వాస్తవమని మెదక్ ఎంపీ రఘునందన్ (Ragunandan Rao)రావు తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ నాయకుడు తమతో మాట్లాడితే దానికి బ్రేకింగ్స్, స్క్రోలింగ్స్ ఎందుకని ప్రశ్నించారు. తండ్రి మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలని చెబితే కొట్టినట్టా? అని ప్రశ్నించారు. తమ లీడర్ల ఇంట్లో తాము భోజనానికి వెళ్తే తప్పా అని నిలదీశారు.
నిధులపై గ్రామ పంచాయతీలు..
అర్వింద్ కొత్త ఇల్లు కట్టారని, భోజనానికి పిలిచారని ఆయన చెప్పారు. అలా ఏదైనా అకేషన్ ఉంటే అంతా కలుస్తామని రఘునందన్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ పేరు మార్పుపై కాంగ్రెస్ ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవాచేశారు. కేంద్రం ఇచ్చే నిధులపై గ్రామ పంచాయతీలు ఆధారపడ్డాయని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు వచ్చే నిధులు 15 ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తాయన్నారు. రేపోమాపో 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి పంచాయతీలకు మూడేళ్ల డబ్బులు రానున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికలు పెట్టిందే ఈ నిధులు కోసమని ఆయన చెప్పారు. ఉపాధి హామీ పథకంపై ఈ ఆర్థిక సంవత్సరం కేంద్రం రాష్ట్రానికి రూ.1250 కోట్లు విడుదల చేసిందని, ఇందులో నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.250 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. మిగతా డబ్బు ఎందుకు ఖర్చు చేయలేదని రఘునందన్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు రూపాయి అందలేదని, లోకల్ అడ్మినిస్ట్రేషన్ అనే పదానికి అర్థం లేకుండా కాంగ్రెస్ చేసిందని విరుచుకుపడ్డారు. 150 పథకాల్లో 2, 3 పథకాలకు మాత్రమే కాంగ్రెస్.. గాంధీ పేరును పెట్టిందని, బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగే హింసపై కాంగ్రెస్ కనీసం మాట్లాడేందుకు కూడా ముందుకు రావడం లేదన్నారు.
రాహుల్ గాంధీకి తండ్రి అంటే..
ఇదిలా ఉండగా ఖర్గే ముందు తన సొంత రాష్ట్రంలో పంచాయితీని చూసుకోవాలని రఘునందన్ రావు సూచించారు. అక్కడ భవిష్యత్ లో ఎన్నికలు వస్తే ఏమవుతుందో అది చూసుకోవాలన్నారు. తండ్రి ఈవీఎంలు ప్రవేశపెడితే కొడుకు దాన్ని వ్యతిరేకిస్తున్నాడన్నారు. వారు గెలిస్తే ఈవీఎంలు పనిచేస్తున్నట్టు? బీజేపీ గెలిస్తే పనిచేయనట్టా? అని నిలదీశారు. రాహుల్ గాంధీకి తండ్రి అంటే గౌరవం, విశ్వాసం లేదని విమర్శించారు. ముక్కలైన కాంగ్రెస్.. దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని ఫైరయ్యారు. ఇకపోతే బావ, బావమరిదితో అవ్వట్లేదని కేసీఆర్ ను బయటికి తెచ్చారని, కేసీఆర్ బయటికు వచ్చినా తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి సభలు పెడుతున్నారని, డబ్బులు పెట్టినా జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ లో ఏం జరిగిందో రిపీట్ అవుతుంది తప్పితే ఒరిగేదేమీ లేదన్నారు. ఇంట్లో పంచాయితీతో బీఆర్ఎస్ ప్రమాదంలో పడిందని, అందుకే కేసీఆర్ ను బయటికి తెచ్చారని రఘునందన్ రావు ఎద్దేవాచేశారు.
Also Read: Jagan Fans: నడిరోడ్డుపై జగన్ ఫ్యాన్స్‌కు పోలీసుల స్ట్రాంగ్ ట్రీట్‌మెంట్

