మెదక్, స్వేచ్ఛ : మెదక్ (Medak), కామారెడ్డి (Kamareddy) జిల్లాల్లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మెదక్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మెదక్ ఎస్పీ వివరాలు వెల్లడించారు. మెదక్ పట్టణం ఫతేనగర్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖాదీర్, మహమ్మద్ అబ్దుల్ షఫీలు ఈ దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పారు. నలుగురు మహిళల నుంచి మొత్తం 12 తులాల బంగారు పుస్తెలతాళ్లతో పాటు మరో రెండు చోట్ల చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారని తెలిపారు.
సోమవారం ఔరంగాబాద్ శివార్లో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో బైక్ పై ఇద్ధరు పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకున్నామన్నారు. వారిని విచారించగా నేరాలు అంగీకరించారని.. 6 తులాల బంగారం అభరణాలు రికవరీ చేశామని వెల్లడించారు. స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు దొంగలకు గతంలో క్రిమినల్ హిస్టరీ లేదని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది రమేష్, కుమార్, జయానంద్, ఎండీ.గౌస్, హోంగార్డు వర ప్రసాద్(లడ్డు)లను ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, హవేలి ఘనపూర్ ఎస్ఐ సత్యనారాయణ ఉన్నారు.
యువతపై తల్లి దండ్రులు దృష్టి పెట్టాలి
యువత కదలికలపై తల్లి దండ్రులు దృష్టి సారించాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్, గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడి చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా నిఘా ఉంచాలన్నారు. గ్రామాలు, పట్టణంలో వీధుల్లో కొత్త వారు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.