Digvijaya Singh: కాంగ్రెస్ పార్టీ (Congress Party) కేంద్ర నాయకత్వంలో విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. శనివారం (డిసెంబర్ 27) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం జరుగుతున్న వేళ ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) సోషల్ మీడియాలో ఘాటైన పోస్ట్ పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక పాత ఫోటోను షేర్ చేశారు. ఈ ఫొటో 1990వ దశకానిది. నాడు నరేంద్ర మోదీ (Narendra Modi) ఒక సామాన్య కార్యకర్తగా ఉండగా, గుజరాత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ (BJP) దిగ్గజం ఎల్‌కే అద్వానీ (LK Advani) ఒక కుర్చీలో కూర్చొని ఉండగా, నాడు యువకుడిగా ఉన్న మోదీ… అద్వానీ ముందు నేలపై కూర్చొని కనిపించారు. ఈ ఫొటో ప్రభావవంతమైనదంటూ దిగ్విజయ్ సింగ్ రాసుకొచ్చారు. తాను ఈ ఫొటోను కోరాలో (Quora) చూశానని, ఇది చాలా ప్రభావవంతంగా ఉందని ప్రశంసించారు. ‘‘ క్షేత్రస్థాయిలో ఉండే ఆర్ఎస్ఎస్‌కు చెందిన ఒక స్వయంసేవక్, జనసంఘ్ లేదా బీజేపీ కార్యకర్త.. ఒకప్పుడు నేతల పాదాల చెంత నేలపై కూర్చున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రిగా ఎలా ఎదిగారో చూడండి. ఇదీ ఒక సంస్థ బలం. జై శ్రీరామ్’’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ పోస్టును కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ట్యాగ్ చేశారు. దీంతో, తాను చెప్పదలచుకున్న సందేశాన్ని నేరుగా కాంగ్రెస్ అధిష్టానానికి దిగ్విజయ్ సింగ్ చేరవేసే ప్రయత్నం చేసినట్టుగా ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై ప్రశంసలు
ఈ పోస్ట్ ద్వారా బీజేపీని, దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ (RSS) సంస్థాగత బలాన్ని ప్రశంసించినట్టు అయ్యింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఆయన విమర్శలు చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఈ పోస్ట్ పెట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ ఫొటో షేర్ చేయడం ద్వారా హస్తం పార్టీ నాయకత్వానికి తన మనసులోని మాటను బలంగా చెప్పినట్టు అయ్యిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, ఈ ఫొటోని 1996లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింగ్ వాఘేలా ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా తీసినట్లు తెలుస్తోంది.
దిగ్విజయ్ సింగ్ వివరణ ఇదే
తన పోస్ట్ వివాదస్పదం కావడంతో దిగ్విజయ్ సింగ్ స్పందించి వివరణ ఇచ్చారు. తాను కేవలం బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని మాత్రమే ప్రశంసించానని, అయితే, బీజేపీని వ్యతిరేకించడం ఎన్నటికీ కొనసాగిస్తానంటూ స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ దిగ్విజయ్ సింగ్ స్పందించడం ఇదే తొలిసారి కాదని రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. వారం రోజుల క్రితం కూడా ఆయన కాంగ్రెస్‌లో సంస్థాగత సంస్కరణలు జరగాలని అన్నారు. కానీ, రాహుల్ గాంధీని ఒప్పించడం అంత తేలిక కాదంటూ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో అంతర్గత వికేంద్రీకరణ జరగాలని ఆయన ఆయన చాలాకాలంగా అభిప్రాయపడుతున్నారు.

