Indian Railways: మధ్యతరగతి జీవులకు ప్రధాన రవాణా సాధనమైన రైల్వేలకు రోజురోజుకూ ప్రయాణికుల రద్దీ పెరిగిపోతోంది. ఎన్ని ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తున్నా చాలడం లేదు. అయితే, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఇండియన్ రైల్వేస్ (Indian Railways) నిర్ణయించింది. ఇందులో భాగంగా రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రణాళికపై ఆలోచనలు చేస్తోంది. నగరాల్లో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా, నెట్‌వర్క్‌ను విస్తరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాన నగరాల పరిధిలో నెట్‌వర్క్‌ను విస్తరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రైల్వే భారీ మౌలిక సదుపాయాల విస్తృతంగా విస్తరించాలని నిర్ణయించింది. ప్రస్తుత నెట్‌వర్క్‌పై ప్యాసింజర్ల రద్దీ తీవ్రంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రణాళికను సిద్ధం చేసిందని, 2030 నాటికి ప్లాన్ అమలు పూర్తవుతుందని కథనాలు వెలువడుతున్నాయి.
ప్లాన్‌లోని కీలకాంశాలు ఇవే
రాబోయే ఐదేళ్లలో ప్రధాన నగరాల నుంచి బయలుదేరే రైళ్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా మౌలిక సదుపాయాల విస్తరణ చేపడతారు. 2030 నాటికి పనులను పూర్తి చేయాలని రైల్వే లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్యాసింజర్ల డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు కొత్త టెర్మినల్స్‌ను కూడా నిర్మించనున్నారు. ప్రతి ప్రధాన నగరంలో ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను, విస్తరణకు ఉన్న అవకాశాలను అధికారులు అంచనా వేసి నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ఈ విస్తరణ ఎంతో దోహదపడుతుందని అధికారిక ప్రకటనలో ఇండియన్ రైల్వేస్ పేర్కొంది.
కాగా, ప్రస్తుత టెర్మినల్స్ విస్తరణలో భాగంగా అదనపు ప్లాట్‌ఫామ్‌లు, స్టేబ్లింగ్ లైన్లు, పిట్ లైన్లు, షంటింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ప్రస్తుతం ఉన్న టెర్మినల్స్‌ను మెరుగుపడతాయి. ప్రణాళికలో భాగంగా నగర పరిధిలో, చుట్టుపక్కల ప్రాంతాలలో కొత్త టెర్మినల్స్‌కు అనువైన ప్రదేశాలు గుర్తించి, నిర్మిస్తారు. మెగా కోచింగ్ కాంప్లెక్స్‌లతో పాటు రైళ్ల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తారు. ట్రాఫిక్ సౌకర్యాలు, సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ, అదనపు రైళ్ల రాకపోకలను తట్టుకోవడానికి వివిధ పాయింట్ల వద్ద మల్టీ-ట్రాకింగ్‌లను కూడా ఏర్పాటు చేస్తారు. రద్దీని సమానంగా నిర్వహించేందుకు వీలుగా, ప్రధాన స్టేషన్లతో పాటు వాటికి ఆనుకుని ఉండే స్టేషన్లను కూడా అభివృద్ధి చేయనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఉదాహరణగా చూస్తే, పుణె స్టేషన్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు సమీపంలోనే ఉండే హడప్సర్, ఖడ్కీ, ఆలంది స్టేషన్లను కూడా విస్తరణ ప్రణాళికలో చేర్చనున్నట్టు అధికారులు వివరించారు.

