Ramchander Rao: వయస్సు ధైర్యానికి అడ్డుకాదని, విశ్వాసం, గౌరవం, అణచివేతకు వ్యతిరేకంగా నిలబడే అత్యున్నత విలువలు చిన్న వయస్సులోనూ ఎలా ప్రతిఫలించగలవో సాహిబ్జాదా బాబా జోరావర్ సింగ్, సాహిబ్జాదా బాబా ఫతేహ్ సింగ్ త్యాగాన్ని చూస్తే తెలుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. వీర్ బాల్ దివస్ సందర్భంగా సికింద్రాబాద్ గురుద్వారాలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సాహిబ్జాదా బాబా జోరావర్ సింగ్, సాహిబ్జాదా బాబా ఫతేహ్ సింగ్ వీరమరణం భారతీయ నాగరికత చరిత్రలో అత్యంత ప్రేరణాత్మక అధ్యాయాల్లో ఒకటని పేర్కొన్నారు. వీర్ బాల్ దివస్ కేవలం స్మరణ దినం మాత్రమే కాదని, ధైర్యం, ధర్మం, అన్యాయానికి ఎదురునిలిచే భారతదేశ శాశ్వత విలువలను పున:ప్రతిపాదించే ముఖ్యమైన దినమని అన్నారు.
Also Read: Ramchander Rao: కాంగ్రెస్ తీరు సనాతన ధర్మ విరోధిగా ఉంది : రాంచందర్ రావు
కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది
2014 నుంచి సిక్కుల సంక్షేమం, గౌరవం, సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. 1984 యాంటీ-సిక్కు అల్లర్ల బాధితులకు న్యాయం అందించడంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక చర్యలు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. లంగర్ కార్యక్రమాలకు ఉపయోగించే ఆహార పదార్థాలపై జీఎస్టీ మినహాయింపు కల్పించే సేవా భోజ్ యోజన వంటి ముఖ్యమైన పథకాలను కూడా ఆయన ప్రస్తావించారు. సంవత్సరానికి సుమారు రూ.325 కోట్ల వ్యయంతో అమలవుతున్న ఈ పథకం ద్వారా లంగర్‌లకు ఉపయోగించే ఆహారంపై జీఎస్టీని కేంద్రం రీయింబర్స్ చేస్తోందని, దీనిద్వారా ప్రతిరోజూ దాదాపు ఒక కోటి మందికి ఉచిత భోజనం అందించే గురుద్వారాలకు గణనీయమైన సాయం అందుతోందని రాంచందర్ రావు వివరించారు. అనంతరం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు వీర్ సాహిబ్జాదేల చిత్రపటానికి సిక్కు పెద్దలతో కలిసి నివాళులర్పించారు.
Also Read: Ramchander Rao: పైడిపల్లెలో రీకౌంట్ చేయాలి.. లెక్కింపులో తప్పిదాలు జరిగాయి : రాంచందర్ రావు

