Raja Singh: తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గత కొంతకాలం క్రితం పార్టీకి రాజీనామా చేసిన ఆయన బీజేపీకి దూరంగా ఉంటున్నారు. కానీ తాజాగా ఆయన కాషాయ గూటికి చేరబోతున్నట్లు పరోక్ష సంకేతాలు సంకేతాలు ఇస్తుండటం అటు పార్టీలో.. ఇటు పొలిటికల్ గా చర్చనీయాంశంగా మారింది. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, పార్టీ పరంగా రాజాసింగ్‌కు సరైన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తి గతంలో వ్యతిరేకతకు దారితీసింది. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సొంత పార్టీ అండ లేకుండా తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని భావించే ఆయన తిరిగి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కిషన్ రెడ్డితో రాజాసింగ్‌కు తీవ్ర విభేదాలు
గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో రాజాసింగ్‌కు తీవ్ర విభేదాలు తలెత్తాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై, ముఖ్యంగా కిషన్ రెడ్డి శైలిపై ఆయన బహిరంగంగానే ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కాకపోవడానికి నేతలే కారణమని అప్పట్లో దుయ్యబట్టారు. అయితే, ఇప్పుడు మారిన సమీకరణాల నేపథ్యంలో పాత విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి రాజీనామా చేసినా సోషల్ మీడియా వేదికగానూ బీజేపీ అగ్రనేతలను ప్రశంసిస్తూ, హిందుత్వ అజెండానే తన మార్గమని రాజాసింగ్ స్పష్టం చేస్తూ వచ్చారు. కాగా త్వరలోనే అధిష్టానం పిలుస్తుందని ఆశతో ఆయన ఉన్నారు. జాతీయ నేతలతో చర్చించి అధికారికంగా పార్టీలోకి వస్తాననే పరోక్ష సంకేతాలను ఆయన తన అనుచరులకు ఇస్తున్నట్లు సమాచారం.
Also Read: Raja Singh: నేను బీజేపీలో చేరను.. పార్టీని సర్వనాశనం చేస్తున్నారు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..!
బీజేపీకి, రాజాసింగ్ వంటి ఫైర్ బ్రాండ్ నేత అవసరం ఉంది
రాజాసింగ్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత పార్టీలోకి రావడం బీజేపీకి లాభమే అయినా, ఆయన దూకుడు స్వభావం మరియు క్రమశిక్షణారాహిత్యంపై పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. కిషన్ రెడ్డి సహా ఇతర కీలక నేతలు ఆయనను ఎంతవరకు కలుపుకుపోతారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. కాకపోతే, రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న బీజేపీకి, రాజాసింగ్ వంటి ఫైర్ బ్రాండ్ నేత అవసరం ఉందని ఒక వర్గం వాదిస్తోంది. రాజాసింగ్ అనుకున్నట్లుగా హైకమాండ్ ఆయనకు డోర్లు తెరుస్తుందా? అనేది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే గతంలో ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసింది. మళ్లీ ఎన్నికలకు ముందు ఆయన పార్టీలోకి చేరారు. ఆపై మళ్లీ సొంత పార్టీపై విమర్శలు చేసి రాజీనామా చేశారు. ఒక వేళ హైకమాండా ఆయన్ను స్వాగతించినా.. రాష్ట్ర నాయకత్వం ఆయన్ను ఆహ్వానిస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆయన తిరిగి పార్టీలోకి చేరితే ఆయన్ను కలుపుకుని వెళ్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా, రాజాసింగ్ అధికారికంగా కమలం తీర్థం పుచ్చుకుంటే తెలంగాణ బీజేపీలో కొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం ఉంది.
ముందో.. వెనుకో ఇంటికి తిరిగి వెళ్లాల్సిందే.. : రాజాసింగ్
ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉండి, అందులో ఒకరు గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోతే.. కాస్త ముందుగానే లేదా ఆ తరువాతనో అయినా అతను ఇంటికి తిరిగి వెళ్లాల్సి ఉంటుందని, అలాగే ఇప్పుడు కాకుంటే, భవిష్యత్ లో ఎప్పుడైనా తాను కూడా తన ఇంటికి తిరిగి వెళ్లాల్సి వస్తుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. తాను బీజేపీకి నిజమైన సైనికుడినని, ఢిల్లీ లేదా రాష్ట్ర ఉన్నతాధికారులు తనను పిలిచిన రోజు, తాను తిరిగి పార్టీలో చేరుతానని స్పష్టంచేశారు. తాను ఇంతకు ముందు కూడా ఇదే అభ్యర్థన చేశానని, ఇప్పుడు కూడా అదే అభ్యర్థన చేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీలో స్వేచ్ఛ కల్పించాలని, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీకి వారి నియోజకవర్గంలో స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన కోరారు. అప్పుడే పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రేపో మాపో అయినా తనకు ఢిల్లీ పెద్దల నుంచి కానీ రాష్ట్ర పెద్దల నుంచి కానీ పిలుపు వస్తుందని తనకు కచ్చితంగా తెలుసని రాజాసింగ్ వెల్లడించారు. వారి నుంచి ఫోన్, పిలుపు రాగానే వారికి తమకు స్వేచ్ఛ ఇవ్వండని రిక్వెస్ట్ చేస్తానంటూ పేర్కొన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం తో తమ యుద్ధం ఎలా ఉంటుందో చూడాలని స్పష్టంచేశారు.
Also Read: Raja Singh: నేను బీజేపీలో చేరను.. పార్టీని సర్వనాశనం చేస్తున్నారు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..!

