Medaram Temple: మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆలయ నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని నమస్తే తెలంగాణ పత్రిక ప్రచురించిన తప్పుడు, ఆధారహీన కథనంపై ఆదివాసి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆదివాసుల చరిత్ర, సంస్కృతి, విశ్వాసాలపై విషం చిమ్మేలా కథనాలు రాస్తూ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించాయి. ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న సమ్మక్క సారలమ్మ ఆర్కియోలాజి ఇండిజినియస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బృందం నాయకుడు మైపతి అరుణ్ కుమార్ మీడియాతో శుక్రవారం నాడు మేడారంలో మీడియాతో మాట్లాడారు. గత 15 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా చేసిన ఆదివాసి చరిత్ర పరిశోధనల ఆధారంగా 103 రోజులుగా పరిశోధక బృందం పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తూ మేడారం ఆలయ నిర్మాణం జరుగుతోందని స్పష్టం చేశారు.
భాషకు గౌరవం ఇవ్వలేదు
గద్దెలపై, ప్రహరీ గోడలపై చిత్రించిన 7 వేల బొమ్మలు, తమ పూర్వీకులు వాడిన డాలు గుడ్డలోని రెడ్ క్లాత్ పై ఉన్న బొమ్మలు, రీసెర్చ్ సెంటర్‌కు లభించిన కొండ గుహల తాళపత్ర గ్రంథాలు, కోయ శాసనాలు ఆధారంగా ఒక్కో బొమ్మను వందసార్లు పరిశీలించి రూపొందించామని తెలిపారు. ఆధారం లేకుండా ఏ ఒక్క చిహ్నాన్ని, చరిత్రను నిర్మించలేదని స్పష్టంగా చెప్పారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా దేశంలో ఏ ప్రభుత్వం ఆదివాసుల చరిత్ర, సంస్కృతి, జీవన విధానం, భాషకు గౌరవం ఇవ్వలేదని, కానీ మేడారంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, ఆదివాసి బిడ్డ మంత్రి సీతక్క ఆదిమ మూలాలను గౌరవిస్తూ ఆలయ నిర్మాణానికి అవకాశం కల్పించిందన్నారు. “ఈ దేశ మూలవాసులు ఆదివాసులే” అని సీఎం గద్దెల ఓపెనింగ్ సందర్భంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
జీవన విధానాలను లిఖించుకునే అవకాశం
ఇతర మతాలకు సంబంధించిన గుర్తులు ఉండకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, గోత్రాలు, సంప్రదాయాలు, జీవన విధానాలను లిఖించుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. సమ్మక్క సారలమ్మ పూజారులు, సిద్ధబోయిన కొక్కెర వంశస్థులు అందరూ కలిసి గుడి పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నామని చెప్పారు. నమస్తే తెలంగాణ పత్రిక మాత్రం ఆదివాసుల సంస్కృతిపై విషం చిమ్ముతూ, ఆదివాసి చరిత్రను కాలరాసే విధంగా కథనాలు రాస్తోందని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆదివాసులకు గుడి కట్టాలనే ఆలోచన రాకుండా, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంటే వక్రీకరిస్తూ కథనాలు రాయడం అన్యాయమని విమర్శించారు. తమను సంప్రదించకుండానే కథనాలు రాయడం మీడియా ధర్మానికి విరుద్ధమన్నారు.
శివలింగాలు, శంఖం, గంట, తాబేలు, సింహం, పులి, త్రిశూలం వంటి చిహ్నాలు ఆదిమ సంస్కృతికి, కోయ శాసనాలకు సంబంధించినవేనని, వాటిని ఇతర మతాల గుర్తులుగా వక్రీకరించి చూపడాన్ని సహించబోమని హెచ్చరించారు. తాళపత్రాల్లో ఉన్న నిలువు గీతలను తిరుమతి నామంగా చిత్రీకరించి ఆదివాసి చరిత్రను బంధించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క మతాల బొమ్మలు వేశామంటే మా గొంతు మేమే కోసుకున్నట్టే. మేము మూర్ఖులం కాదు – ఆదివాసులం” అని స్పష్టం చేశారు. పూజారుల నిర్ణయం మేరకే ఆలయ పనులు జరుగుతున్నాయని, ఆదిమ చరిత్ర మరో వేయేళ్లపాటు నిలబడుతుంది ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Medaram Jatara: మేడారం కీర్తి ప్రపంచానికి తెలిసేలా చేయాలి.. అధికారులకు మంత్రి ఆదేశం
నమస్తే తెలంగాణ పత్రిక వివాదాస్పదం
ఏ ఒక్క ఆధారం లేకుండా తప్పుడు కథనాలు రాస్తే ఆదివాసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అనుమానాలు ఉంటే ఇక్కడికి వచ్చి చూడాలని, ఆధారాలు చూపించి నివృత్తి చేస్తామని అన్నారు. “మా చరిత్రను ప్రపంచానికి చెప్పుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. మా గుడి మీద కుట్ర చేస్తే ఆదివాసీల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుంది” అని మైపతి అరుణ్ కుమార్ హెచ్చరించారు. మేడారం ఆలయ ప్రాంగణంలో చెక్కిస్తున్న ఆదివాసి చిహ్నాలకు సంబంధించి వాటి మూలాలు, ఆధారాలు, చరిత్రాత్మక నేపథ్యం అన్నింటినీ తాళపత్ర గ్రంథాలు, ఆదిమ శాసనాలు, పూర్వీకుల డాలు గుడ్డలపై ఉన్న బొమ్మల ఆధారంగా సమగ్రంగా వివరించారు. నమస్తే తెలంగాణ పత్రిక వివాదాస్పదం చేస్తున్న పలు చిహ్నాలకు సంబంధించి, అవి ఇతర మతాలకు చెందినవని ఆరోపించడం పూర్తిగా అవాస్తవమని, మూలవాసుల మూలధారలు, తాళపత్ర గ్రంథాల్లోని స్పష్టమైన ఆధారాలను చూపిస్తూ వివరణ ఇచ్చారు.
చిహ్నాలు ముమ్మాటికీ ఆదిమ సంస్కృతికి చెందినవే
భక్తులు “గోవిందా గోవిందా” అని కొలిచే గోవిందరాజు నాలుగో గోట్టు వంశస్థుడు. ఆయనకు సంబంధించిన పడిగే బొమ్మపై నిలువు గీత ఉంటుంది. ఆ నిలువు గీత గోవిందరాజుకు చెందిన గుర్తు మాత్రమే. దాన్ని తిరుమల వెంకన్న నామంగా చిత్రీకరించడం చరిత్రను వక్రీకరించడమే అవుతుందని స్పష్టం చేశారు. ఇక్కడ కనిపిస్తున్న నిలువు గీతను తిరుమతి నామంగా ప్రచారం చేసి ఆదివాసి చరిత్రను బంధించాలనే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. లింగం, శంఖం వంటి చిహ్నాలు ముమ్మాటికీ ఆదిమ సంస్కృతికి చెందినవే అని, అవి కోయలు, ఆదివాసీ సమాజ జీవన విధానంలో భాగమని వివరించారు. తుపాకులగూడెం – టేకులగూడెం ప్రాంతంలో ఉన్న వీరమయ్య ఆలయం నుంచే అప్పట్లో రాజ్య పరిపాలన వ్యవస్థ నడిచిందని చరిత్ర చెబుతోందని గుర్తు చేశారు. పూర్వకాలంలో బేరంబోయిన రాజు మూలాలు కూడా శివుని రూపంలోనే ఇక్కడ ఉన్నాయని ఆధారాలు చెబుతాయని వివరించారు.
ఆదిమ సంస్కృతి ఆధారాలుగా ఉన్నాయని స్పష్టం
సమ్మక్క, పగిడిద్ద రాజు మూలాలను తెలిపే తాళపత్ర గ్రంథాల్లో స్పష్టంగా శివలింగాల చిత్రాలు కనిపిస్తున్నాయని, ఇవన్నీ కోయ సమాజానికి చెందిన ఆదిమ చిహ్నాలేనని పేర్కొన్నారు. వడ్డే గోత్రానికి సంబంధించిన ప్రధాన చిహ్నం సింహం అని, అదే విధంగా పులి రూపంలో సమ్మక్క దర్శనమిస్తుందని తెలిపారు. ఈ డాలు గుడ్డలు, గోత్ర చిహ్నాల ఆధారంగానే చరిత్రను నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. కోయ శాసనాలలో ఐదో గోట్టు వడ్డేలకు చెందినదని, వారి గోత్ర చిహ్నం త్రిశూలమని తాళపత్ర గ్రంథాల్లో స్పష్టంగా ఉందని చెప్పారు. ఆ త్రిశూలాన్ని ఇతర విశ్వాసాలకు ముడిపెట్టి వక్రీకరించవద్దని హెచ్చరించారు. మొత్తంగా, ఏ ఒక్క చిహ్నాన్ని కూడా ఊహాజనితంగా రూపొందించలేదని,ఇతర విశ్వాసాల నుంచి తీసుకోలేదని.. ప్రతి చిహ్నం వెనుక తాళపత్రాలు, శాసనాలు, గోత్ర సంప్రదాయాలు, ఆదిమ సంస్కృతి ఆధారాలుగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఆదివాసి చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు కొనసాగితే ఆదివాసీల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనుమానాలు ఉంటే నేరుగా వచ్చి ఆధారాలు చూసి నివృత్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Also Read: Medaram Jatara: మేడారం కీర్తి ప్రపంచానికి తెలిసేలా చేయాలి.. అధికారులకు మంత్రి ఆదేశం

