KTR on CM Revanth: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) అసెంబ్లీలో అడుగుపెడితే సీఎం రేవంత్ (CM Revanth Reddy) పని ఇక అంతేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే రేవంత్ రెడ్డి ముచ్చెమటలు పట్టాయని విమర్శించారు. హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. తనపై, కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
‘మా అయ్య మెుగోడు’
కేసీఆర్ పేరు పదే పదే చెప్పుకుంటున్నావంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ‘మా అయ్య మెుగోడు.. తెలంగాణ తెచ్చిన మెునగాడు.. మా అయ్య పేరు బరాబర్ చెప్పుకుంటా’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘మీరు చక్కటి పనులు చేస్తే మీ పిల్లలు కూడా మీ పేరు చెప్పుకుంటారు. కానీ మీరు చెడ్డ పనులు చేస్తే మీ మనవడు కూడా మీ పేరు చెప్పడు. కాబట్టి మీరు కూడా మంచి పనులు చేయాలి’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మా అయ్య మొగోడు, తెలంగాణ తెచ్చిన మొనగాడు
బరాబర్ మా అయ్య పేరు చెప్పుకుంటా
నేను కాకపోతే మా అయ్య పేరు ఇంకెవరు చెప్పుకుంటరు?
– కేటీఆర్ pic.twitter.com/8CabOD8F7I
— BIG TV Breaking News (@bigtvtelugu) December 26, 2025
‘మీ అల్లుడు ఆంధ్రోడే కదా’
మరోవైపు తాను గుంటూరులో చదువుకుంటే సీఎం రేవంత్ రెడ్డికి వచ్చిన బాధ ఏంటని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. మీ అల్లుడు కూడా ఆంధ్రోడే కదా అంటూ ప్రశ్నించారు. తాను ఉన్నంత వరకూ కల్వకుంట్ల ఫ్యామిలీని రాజకీయాల్లోకి రానివ్వనని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సైతం కేటీఆర్ సమాధానం ఇచ్చారు. కొండగల్ లో సీఎం రేవంత్ రెడ్డిని ఓడించే బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు చెప్పారు. పథకాల అమలు విషయం గురించి ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి పై కేటీఆర్ సైటైర్లు వేశారు. ఆయన ఎనుముల రేవంత్ రెడ్డి కాదని.. ఎగవేతల రెడ్డి అంటూ ఎద్దేవా చేసారు.
Also Read: Sankranti Holidays: గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు ఖరారు.. ఏకంగా 9 రోజులు హాలీడే
‘ఎన్నికల హామీలు ఏమయ్యాయి’
ఎన్నికలకు ముందు కల్యాణలక్ష్మీ కింద ఆడబిడ్డల పెళ్లికి రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తానని సోనియాగాంధీ మీద రేవంత్ రెడ్డి ఒట్టువేశారని కేటీఆర్ అన్నారు. అలాగే మహిళలకు రూ.2500 ఇస్తానని ప్రియాంక గాంధీ మీద ఒట్టు వేశారని ఆరోపించారు. ఇవన్నీ చేయకపోగా.. ఇప్పుడు కోటి మంది మహిళలను కోటీశ్వరులని చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి పగల్భాలు పలుకుతున్నారని దుయ్యబట్టారు. కోటి మందిని కోటీశ్వరులను చేసేందుకు రాష్ట్ర బడ్జెట్ సరిపోతుందా? అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి లాగా తాను తిట్టాలంటే మూడు భాషల్లో పొల్లు పొల్లు తిట్టగలనని కేటీఆర్ స్పష్టం చేశారు.

