Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)కు త్వరలోనే నోటీసులు జారీ కానున్నాయా?..అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితునిగా ఉన్నదక్కన్ కిచెన్ హోటల్(Deccan Kitchen Hotel) యజమాని నందకుమార్ స్టేట్ మెంట్ రికార్డు చేయటం ఇందుకే అని పేర్కొంటున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసులో ఇప్పటివరకు జరిపిన విచారణలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఏయే నాయకులు? ఏయే పారిశ్రామిక వేత్తలు? జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేశారన్న దానికి సంబంధించి ఫోన్ నెంబర్లు మాత్రమే దొరికాయి. తప్పితే ఎలాంటి ఆడియో టేపులు వెలుగు చూడలేదు.
అప్పట్లో పైలెట్ రోహిత్ రెడ్డి..
అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మాత్రం ఆడియో టేపులు బయట పడ్డాయి. ఈ కేసులో నిందితునిగా ఉన్న నందకుమార్(Nandakumar) అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కెప్టెన్ రోహిత్ రెడ్డి(Rohith Reddy), సింహయాజీ స్వామిలతో మాట్లాడిన సంభాషణలకు సంబంధించిన ఆడియో టేపులను కేసీఆర్(KCR) మీడియా సమావేశంలో స్వయంగా వినిపించారు. తమ ప్రభుత్వాన్నికూల్చటానికి బీజేపీ కుట్రలు చేసిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, ఈ వ్యవహారంలో తానే నందకుమార్ తో మాట్లాడినపుడు తన ఫోన్ ద్వారానే మాటలు రికార్డు చేసినట్టు అప్పట్లో పైలెట్ రోహిత్ రెడ్డి చెప్పారు. ఇది నిజమే అనుకున్నా నందకుమార్ ఇదే కేసులో మరో నిందితునిగా ఉన్న సింహయాజి స్వామితో మాట్లాడిన సంభాషణలను ఎవరు రికార్డు చేశారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. నిజానికి బీజేపీని ఇరుకున పెట్టటానికే పక్కా స్కెచ్ ప్రకారం నందకుమార్ ఫోన్ ను ట్యాప్ చేసినట్టుగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ట్యాపింగ్ చేయటంతోపాటు మొయినాబాద్ లోని పైలెట్ రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్ కు నందకుమార్, సింహయాజి స్వామిలను పిలిపించి సీక్రెట్ కెమెరాల ద్వారా అంతా రికార్డు చేసి కేసులు నమోదు చేశారు. ఆ తరువాత వారిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుల్లో అప్పట్లో సైబరాబాద్ కమిషనర్ గాన్న స్టీఫెన్ రవీంద్ర కీలకంగా వ్యవహరించారు. తానే స్వయంగా ఫార్మ్ హౌస్ కు వెళ్లారు.
Also Read: Google Search Trends 2025: గూగుల్ సెర్చ్ 2025లో అత్యధికంగా సెర్చ్ అయిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?..
కేసీఆర్ చేతికి ఎలా చేరాయి…?
నందకుమార్ మాట్లాడిన ఫోన్ కాల్స్ ఆడియో టేపులు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చేతికి ఎలా చేరాయి? అన్న అంశంపై ప్రస్తుతం సిట్ దృష్టి సారించింది. నిబంధనల ప్రకారం మావోయిస్టులు, ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులని అనుమానించిన వారి ఫోన్లను మాత్రమే ఎస్ఐబీ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. అయితే, నందకుమార్ ఫోన్ ను ఎందుకు ట్యాప్ చేశారు? ఎవరు ట్యాప్ చేయమన్నారు? ట్యాప్ చేసిన కాల్స్ సంబంధించిన ఆడియో టేపులను కేసీఆర్ వద్దకు ఎవరు చేర్చారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెలుగు చూడాల్సి ఉంది. దీని కోసమే సిట్ త్వరలోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలే చెబుతుండటం గమనార్హం.
నివేదికలో ఆ పదం…
ఇక, నాంపల్లి కోర్టుకు సమర్పించనున్న అదనపు ఛార్జీషీట్ తోపాటు ప్రభాకర్ రావును రెండు వారాలపాటు జరిపిన విచారణకు సంబంధించి సుప్రీం కోర్టుకు సమర్పించనున్న నివేదికలో సిట్ అధికారులు బీఆర్ఎస్ సుప్రీం అన్న పదాన్ని ప్రస్తావించనున్నట్టుగా తెలిసింది. ఇదే కేసులో అరెస్టయిన రాధాకిషన్ రావును గతంలో విచారణ జరిపినపుడు అప్పట్లో ఎస్ఐబీ ఛీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు(Prabhakar Rao) ఆదేశాల మేరకే అంతా చేశామని వెల్లడించిన విషయం తెలిసిందే. దాంతోపాటు తన వాంగ్మూలంలో ఆయన బీఆర్ఎస్(BRS) సుప్రీం సూచనల మేరకే ఈ వ్యవహారం నడిచిందని కూడా వెల్లడించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కస్టోడియల్ వచారణ చివరి రోజైన బుధవారం ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులను కూర్చబెట్టి సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. తన స్టేట్ మెంట్ లో రాధాకిషన్ రావు బీఆర్ఎస్ సుప్రీం అని ప్రస్తావించారని చెబుతూ ఆ సుప్రీం ఎవరు? అని ప్రభాకర్ రావును అడిగినట్టుగా తెలిసింది. అయితే, దీనికి కూడా ప్రభాకర్ రావు మౌనంగా ఉండిపోయినట్టుగా తెలియవచ్చింది.
Also Read: Odisha Encounter: మరో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేత గణేష్ సహా నలుగురు నక్సల్స్ మృత్యువాత

