Ramchander Rao: తెలంగాణలో రాజకీయాలకు ఏమాత్రం విలువ లేదని, విలువలు లేని రాజకీయాలు తెలంగాణలో నడుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchender Rao) వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతోత్సవాలను పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతేకాకుండా 101 దీపాలు వెలిగించి నివాళులర్పించారు. అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ.. దానం నాగేందర్ కాంగ్రెస్ లో ఉన్నారని చెబుతున్నారని, కానీ సీఎం మరోలా మాట్లాడుతున్నారన్నారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో, ఉంటారో తెలియని పరిస్థితి తెలంగాణలో నెలకొందని పేర్కొన్నారు. సీఎం ఒక మాట.., పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఒక మాట మాట్లాడుతున్నారని చురకలంటించారు.
మజ్లిస్ మధ్యవర్తిత్వం..
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ చెప్పాలని ప్రశ్నించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారితో అంటకాగడం మజ్లిస్ నైజమని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ను కలిపేందుకు మజ్లిస్ మధ్యవర్తిత్వం వహిస్తోందని రాంచందర్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డికి రూ.3 వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలకు నిధులు నిలిచిపోవడానికి కారణం కాంగ్రెస్ సర్కారేనని విమర్శించారు. అనంతరం అటల్ స్మృతి వర్ష్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్క్‌లో వాజ్ పేయి విగ్రహాన్ని శుభ్రపరిచి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్, దీపక్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: AP Govt: సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

