Singireddy Niranjan Reddy: పాలమూరులో ఏడు వేల కోట్ల పనులు కాదు తట్టెడు మన్ను కూడా ఎత్తలేదు. గత రెండేళ్లలో ఏం పనులు చేశారో వెల్లడించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులకు బిల్లులు మాత్రమే చెల్లించారు.. కనీసం రూ.500 కోట్ల పనులు చేసి ఉంటే చూయించాలని డిమాండ్ చేశారు. ఆరునెలలు పనులు చేపడితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా సాగునీళ్లు అందేది..2023 సెప్టెంబరులోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అటవీ అనుమతులు వచ్చాయి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా ఒక్క పనీ చేపట్టలేదు.. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కేంద్రం మీద వత్తిడి తెచ్చి డీపీఆర్ వెనక్కి పంపించారన్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జూరాల వద్ద నిర్మించాలి
డీపీఆర్ వెనక్కి రావడమే కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీల నీటికి ఒప్పుకోవడం దుర్మార్గం అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్తగారి ఊర్లో దుందుభి నది మీద చెక్ డ్యామ్ నిర్మించాం. బీఆర్ఎస్ హయాంలో చెక్ డ్యాంల నిర్మాణంతో దుందుభి సస్యశ్యామలం అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జూరాల వద్ద నిర్మించాలని చెప్పడం కాంగ్రెస్ బాధ్యతారాహిత్యం అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఒకసారి చదవాలి. శ్రీశైలం కింద క్రిష్ణాతో పాటు, తుంగభద్ర ద్వారా 400 టీఎంసీల నీళ్లు వస్తాయని కేంద్ర జలసంఘం వెల్లడించింది. శ్రీశైలం వద్ద పాలమూరు వద్దనడం కాంగ్రెస్ నేతల అవగాహన రాహిత్యానికి నిదర్శనం అన్నారు. పాలమూరుకు భూసేకరణ చేయకుండా సూడో మేధావులతో అడ్డుకున్నారని మండిపడ్డారు.
Also Read: MP Niranjan Reddy: జాతీయ సంక్షోభంలో సింగిల్-స్క్రీన్ థియేటర్లు.. రాజ్యసభలో గళమెత్తిన ఎమ్‌పి
బీజేపీ నేత అయినా అడిగాడా?
ఆంధ్రా అధికారులను తీసుకువచ్చి తెలంగాణలో కీలకస్థానాల్లో నియమించడం వెనక అంతర్యం ఏమిటి ? వీరు పాలమూరు హక్కులను కాపాడతారా ? కాంగ్రెస్ నిర్లక్ష్యానికి శ్రీశైలం సొరంగంలో వెలికితీయని ఆరుగురు కార్మికుల శవాలే సాక్ష్యం.ప్రధానమంత్రి అభ్యర్థిగా పాలమూరు బహిరంగసభకు వచ్చిన నరేంద్రమోడి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా ఇస్తామని హామీ ఇచ్చారు. కనీసం పన్నెండేళ్లలో తెలంగాణ నీటి వాటాను తేల్చాలని ఒక్క బీజేపీ నేత అయినా అడిగాడా ? ఒక్కరోజయినా నరేంద్రమోడీని బీజేపీ ఎంపీలు 12 ఏళ్లలో అడిగారా ? అని నిలదీశారు. పాలమూరుకు బీజేపీ పైసా సాయం చేయకుండా అడ్డుకుంటూ అనేక కుట్రలు చేశారన్నారు. క్రిష్ణాలో 299 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకున్నారని చెప్పడం అవివేకం అన్నారు.తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ నాయకత్వంలో రూ.3 వేల కోట్లతో కల్వకుర్తి ఎత్తిపోతల పనులు పూర్తిచేశాం అన్నారు.
27 వేల ఎకరాలు భూసేకరణ చేశాం
కాంగ్రెస్ అక్కసు, వివక్షతో 145 మెగావాట్ల పాలమూరు రంగారెడ్డి పనులను అడ్డుకుంటున్నారన్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి రిజర్వాయర్లు, పంపు హౌస్ లను నిర్మించామన్నారు. పాలమూరు ప్రాజెక్టు కోసం 27 వేల ఎకరాలు భూసేకరణ చేశామని వెల్లడించారు. రైతులకు, పాలమూరు ప్రజలకు మేలు జరగాలన్న ఆకాంక్ష కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డి, మాజీ శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Also Read: Niranjan reddy: యూరియా కొరతపై జిల్లా కలెక్టర్‌ను కలిసిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

