IndiGo Crisis: ఇండియాలో విమానయాన రంగంలో పోటీని మరింత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో తలెత్తిన ఆపరేషనల్ సమస్యల నేపథ్యంలో, Al Hind Air, FlyExpress అనే రెండు కొత్త ఎయిర్‌లైన్స్‌కు కేంద్రం No Objection Certificate (NOC)లు మంజూరు చేసింది. దీని నుంచి దేశీయ విమానయాన మార్కెట్‌లో పోటీ విస్తరించనుందని భావిస్తున్నారు.
సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్ మోహన్ నాయుడు మంగళవారం రాత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. గత వారం రోజులుగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్ ప్రతినిధులతో విమానయాన శాఖ సమావేశాలు నిర్వహించిందని ఆయన తెలిపారు. ఇప్పటికే Shankh Air కు ముందే NOC లభించగా, ఈ వారం Al Hind Air, FlyExpressలకు క్లియరెన్స్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత దేశీయ విమానయాన మార్కెట్‌పై ఇండిగో, టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా గ్రూప్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ రెండు సంస్థలు కలిపి దాదాపు 90 శాతం ప్రయాణికుల ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నాయి. ఇటీవల ఇండిగోలో జరిగిన పెద్ద ఎత్తున విమానాల రద్దు, ఆలస్యాలు ఒక్క ఎయిర్‌లైన్‌లో సమస్యలు తలెత్తితే మొత్తం వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందో స్పష్టంగా చూపించాయి.
Al Hind Air కేరళకు చెందిన Alhind Group ఆధ్వర్యంలో ఉండగా, FlyExpress కు హైదరాబాద్‌కు చెందిన కూరియర్, కార్గో సర్వీసుల సంస్థ మద్దతు ఉంది. ఇక Shankh Air ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, వారణాసి, ఆగ్రా, గోరఖ్‌పూర్ వంటి కీలక నగరాలను కలుపుతూ ప్రాంతీయ, మెట్రో రూట్లపై సేవలు అందించాలనే లక్ష్యంతో ఉంది.
మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు మెట్రోతో పాటు ప్రాంతీయ రూట్లలో సామర్థ్యం, పోటీ పెంచేలా ఉన్నాయని మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపారు. UDAN స్కీమ్ ద్వారా Star Air, IndiaOne Air, Fly91 వంటి చిన్న ఎయిర్‌లైన్స్ సేవలు విస్తరించగలిగాయని ఆయన గుర్తుచేశారు.
NOC లభించడం అంటే ఎయిర్‌లైన్ కార్యకలాపాలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి లభించినట్టే గానీ, వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఇంకా అవకాశం ఉండదు. తదుపరి దశలో DGCA నుంచి Air Operator Certificate (AOC) పొందాల్సి ఉంటుంది. దీనికి ఆర్థిక సామర్థ్యం, విమానాల కొనుగోలు, శిక్షణ పొందిన సిబ్బంది నియామకం, భద్రతా వ్యవస్థలు, ట్రయల్ ఫ్లైట్స్ వంటి కఠిన ప్రమాణాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా, ఇండిగోలో ఇటీవల కొత్త క్రూ రోస్టరింగ్ నిబంధనలు అమలు చేయడంలో తలెత్తిన సమస్యల కారణంగా వందలాది విమానాలు రద్దయ్యాయి. దీంతో వేలాది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఇండిగోకు సుమారు 60 శాతం మార్కెట్ షేర్, ఎయిర్ ఇండియా గ్రూప్‌కు 25 శాతం వరకు వాటా ఉండగా, అకాసా ఎయిర్, స్పైస్‌జెట్ వంటి సంస్థలు చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండిగో మార్కెట్ ఆధిపత్యంపై పోటీ నియంత్రణ కమిషన్ (CCI) కూడా పరిశీలన చేపట్టింది.

