Vedire Sriram: కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కనీసం 500 టీఎంసీల నీళ్ల కోసం గట్టిగా పట్టుబట్టాల్సిన సమయంలో మాజీ సీఎం కేసీఆర్ సర్కార్ కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకుని సంతకాలు చేయడం తెలంగాణకు మరణ శాసనంగా మారిందని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు, మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరె శ్రీరామ్(Vedire Sriram) విమర్శించారు. మంగళవారం ఆయన నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం తెలంగాణ తరఫున సమర్థంగా వాదించి ఉంటే, కనీసం 400 నుంచి 450 టీఎంసీల వరకు నీళ్లు పొందే అవకాశం ఉండేదన్నారు. 2015లో కృష్ణా జలాల వాటా ఒప్పందంలో 299 టీఎంసీలకు కేసీఆర్ సంతకం చేయడం వల్ల 10 ఏళ్లుగా తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందన్నారు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశం
పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ(SLBC), డిండి(Dindi), కోయిల్ సాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన నీళ్లను 2015 వాటర్ షేరింగ్ అగ్రిమెంట్‌లో చేర్చకపోవడం ఘోర తప్పిదమని విమర్శించారు. ఈ ప్రాజెక్టులకు కనీసంగా 261.7 టీఎంసీల నీళ్లు అవసరం ఉన్నప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా 299 టీఎంసీలకే ఒప్పుకోవడం అన్యాయమన్నారు. 299 టీఎంసీ అనేది ఒక్క సంవత్సరానికే అన్న వాదన పూర్తిగా అవాస్తవమని ఆయన వ్యాఖ్యానించారు. 2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా మరో ఏడాది పాటు అదే ఒప్పందాన్ని కొనసాగిస్తూ అప్పటి ముఖ్యమంత్రులు సంతకాలు చేశారని అధికారిక డాక్యుమెంట్లతో సహా ఆధారాలు ఉన్నాయని నొక్కిచెప్పారు. 2016 నుంచి 2020 వరకు ప్రతి సంవత్సరం 299 టీఎంసీల వాటాను కొనసాగిస్తూ సంతకాలు జరిగాయని గుర్తుచేశారు. అయితే, 10 ఏళ్లలో ఒక్క సంవత్సరం కూడా తెలంగాణ 299 టీఎంసీల నీళ్లను పూర్తిగా వినియోగించుకోలేకపోయిందన్నారు.
Also Read: MP DK Aruna: పదేళ్లు తండ్రి చాటు ఉండి.. ఇప్పుడు నీతి వాక్యాలా?: ఎంపీ డీకే అరుణ
ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందని పరిస్థితి
ప్రాజెక్టులు పూర్తయ్యాయని చెబుతున్నప్పటికీ, కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీలు, కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ లేకుండా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందని పరిస్థితి ఉందన్నారు. ఎన్నికల ముందు మోటార్లు ఆన్ చేసి ప్రాజెక్ట్ పూర్తి అన్న భావన కల్పించడమే తప్పా.. రైతులకు వాస్తవంగా నీళ్లు అందలేదని విమర్శించారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్‌లోని పరిమితుల వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని, దీన్ని సరిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం 2023 అక్టోబర్‌లో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చిందని శ్రీరామ్ గుర్తుచేశారు. కొత్త ట్రైబ్యునల్ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా వాదించి ఉంటే 600 నుంచి 700 టీఎంసీల వరకు నీళ్లను తెలంగాణకు తీసుకొచ్చే అవకాశం ఉండేదన్నారు.
ఆలస్యం చేయడం వల్లే..
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఆలస్యం చేయడం వల్లే ఏపీకి వర్క్ ఆర్డర్లు ఇచ్చే అవకాశం దొరికిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నాలుగు టీఎంసీలుగా ఉన్న నీళ్ల చోరీ 10 టీఎంసీలకు పెరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొత్త ట్రైబ్యునల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ద్వారా కృష్ణా బేసిన్ మొత్తాన్ని శాస్త్రీయంగా పునర్విభజించే అవకాశం ఏర్పడిందన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన టెక్నికల్, లీగల్ వాదనలు వినిపించకపోతే ఈ అవకాశాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు నిజమైన న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ట్రైబ్యునల్ ద్వారానే సాధ్యమని శ్రీరామ్ తెలిపారు.

