Kishan Reddy: దేశ రాజకీయాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న మహానాయకుడు పీవీ నరసింహారావు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో భారతదేశం ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషిస్తోందంటే అందులో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(PV Narsimha Rao) పాత్ర అమోఘమని కొనియాడారు. పీవీ నరసింహా రావు 21వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ లో మంగళవారం ఆయన విగ్రహానికి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డగా, తెలుగు ఉభయ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా, మంత్రిగా, కేంద్రమంత్రిగా పీవీ వివిధ బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జాతీయ యువజన విధానం రూపకల్పన జరుగుతుండగా, తాను బీజేపీ తరపున, బీజేవైఎం జనరల్ సెక్రటరీగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంలో పీవీ స్వయంగా సమావేశానికి హాజరై, దేశంలో యువజన విధానం ఏ విధంగా ఉండాలన్న విషయంపై అనేక కీలక సూచనలు చేశారని గుర్తుచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిన సమయంలో దాన్ని తిరిగి ముందుకు తీసుకెళ్లేందుకు పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ధృఢమైన నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు.
రామజన్మభూమి విషయంలో..
అలాగే పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో ఐక్యరాజ్యసమితిలో వివిధ దేశాల సమావేశాలకు భారతదేశం తరఫున నాటి ప్రతిపక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయిని ప్రతినిధిగా పంపించడం ఆయన రాజకీయ విశాలతకు నిదర్శనమని కొనియాడారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరగడంలో కూడా పీవీ నరసింహారావు పాత్ర ఉందని కిషన్ రెడ్డి కొనియాడారు. ఆ సమయంలో ఉద్యమాన్ని అణిచివేయాలని పీవీపై ఒత్తిడి వచ్చినప్పటికీ, రామజన్మభూమి విషయంలో ఎప్పుడూ వ్యతిరేకత చూపలేదన్నారు. చివరకు వివాదాస్పద ఘటనల సమయంలో మజ్లిస్, కాంగ్రెస్ పార్టీ విమర్శించినా కూడా ఆయన ఎలాంటి వ్యతిరేకత చూపకుండా రామజన్మభూమి విషయంలో అనుకూలంగా స్పందించారని గుర్తుచేశారు. అయితే.. పీవీ మరణం తర్వాత కాంగ్రెస్ కనీసం ఆయన పార్థివదేహాన్ని కూడా పార్టీ కార్యాలయానికి కూడా తీసుకెళ్లనీయలేదని విమర్శించారు. కాంగ్రెస్ నష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడి, పార్టీ నాయకులకు అన్ని విధాల సహకారం అందించిన గొప్ప నేత పీవీకి అదే కాంగ్రెస్ తీవ్రంగా అవమానించిందన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు పీవీ నరసింహారావు రాజకీయాలను ఆదర్శంగా తీసుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కారానికే రాజకీయాలు పరిమితం కావాలని, ఈతరం నాయకులు సంయమనం పాటించాలని ఆయన కోరారు.
Also Read: Shambala Buzz: ప్రీమియర్స్ షో బుకింగ్స్‌లో తగ్గేదేలేదంటున్న‘శంబాల’.. సాయికుమార్ హ్యాపీ..
సరికొత్త ఇండస్ట్రియల్ టెక్నాలజీ
అనంతరం జార్ఖండ్‌లోని ఐఎస్ఎం-ధన్‌బాద్‌లో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ క్రిటికల్ మినరల్స్’ ను కిషన్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. దేశ గనుల రంగం భవిష్యత్తుకు.. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ కీలకమైందన్నారాఉ. ఎంతోమంది ప్రతిభావంతమైన ఇంజనీర్లు, ఆధునిక సాంకేతికత, దేశ గనులకు భవిష్యత్తును అందజేస్తున్న అద్భుతమైన సంస్థ అని కొనియాడారు. ప్రపంచంలోనే అత్యధికంగా పేటెంట్ దాఖలు చేసే దేశాల్లో 6వ స్థానంలో భారత్ నిలిచిందన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్ ఎదిగిందని వివరించారు. క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, సరికొత్త ఇండస్ట్రియల్ టెక్నాలజీలపై 6 వేలకు పైగా డీప్‌టెక్ స్టార్టప్ కంపెనీలు పనిచేస్తున్నాయని, దేశంలో సెమీకండక్టర్ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ దేనని, దీంతో ఇంధనానికి కూడా డిమాండ్ పెరుగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో గనుల రంగంలో సుస్థిరమైన అభివృద్ధి సాధించడం పెద్ద సవాలుగా మారిందన్నారు. అందుకే ఈ రంగంలో ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అధునాతన సాంకేతికత సాయంతో ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తున్నట్లు చెప్పారు. ప్రపంచస్థాయి ఆలోచనలతో, దేశ అవసరాలకు అనుగుణంగా మనమంతా ముందుకు సాగాలని, పరిశ్రమలు, ప్రభుత్వం, విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుందని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.

