MP DK Aruna: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కుంభకర్ణుడని, నిద్రలేచి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని పాలమూరు ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) ఘాటుగా విమర్శించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయంలో పదేళ్లు బీజేపీపై ఏడ్చారని, ఇప్పుడు కూడా బీజేపీ(BJP)ని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు పాలమూరుకు అన్యాయం జరిగినట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆమె చురకలంటించారు. పాలమూరు ప్రజలు కేసీఆర్ ను ఎంపీగా గెలిపించకపోతే అసలు తెలంగాణ వచ్చేది కాదని, ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారు కాదని పేర్కొన్నారు. రాజోలిబండ రైతులకు కేసీఆర్ పదేళ్ల అధికారంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పాలమూరును సస్యశ్యామలం చేసినట్లు కేసీఆర్(KCR) ఝూటా మాటలు మాట్లాడారని అరుణ ధ్వజమెత్తారు. పాలమూరుకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్.. 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేదని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నట్లు ఆమె వ్యాఖ్యానించారు.
పాలమూరుకు ఎంపీగా ఉన్న కేసీఆర్..
బీఆర్ఎస్ అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టులను రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ పట్టించుకోలేదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కారణం కేసీఆర్ కాదా అని నిలదీశారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణకు 535 టీఎంసీలు రావాలని, కానీ కేసీఆర్ 299 టీఏంసీలకే ఒప్పుకున్నారని ధ్వజమెత్తారు. 2015 అపెక్స్ సమావేశంలో 299 టీఏంసీలకే ఒప్పుకున్నది నిజం కాదా అనేది కేసీఆర్ సమాధానం చెప్పాలని డీకే అరుణ ప్రశ్నించారు. పాలమూరుకు ఎంపీగా ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, అయినా పాలమూరు ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆమె విమర్శించారు. పాలమూరుపై మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని, కేంద్రం నిధులు ఇవ్వకపోతే మెడికల్ కాలేజీలో ఏం ఉండేదని ఫైరయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని, బీజేపీ అధికారంలోకి రాకుండా కుట్రలు పన్నుతున్నారని అరుణ ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలమూరుకు అన్యాయం జరిగిందంటూ కేసీఆర్ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పాలమూరులోనే లేదన్నారు.
Also Read: Ravi Kiran Kola: విజయ్‌తో ‘రౌడీ జనార్ధన’ ప్రాజెక్ట్ ఎలా ఓకే అయ్యిందంటే?
డీపీఆర్ లేకుండా ఢిల్లీకి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలమూరు జిల్లాకు సాగునీటి వసతిని కల్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్(KCR) పాలమూరు వాసి కాదని, రేవంత్ రెడ్డి పాలమూరు వాసి కాబట్టి ఆయన అయినా ప్రాజెక్టులను పూర్తిచేయాలని పట్టుపట్టారు. కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డికి డీపీఆర్ లేకుండా ఢిల్లీకి పంపిస్తే ఎలా అనుమతులు వస్తాయని అరుణ ప్రశ్నించారు. మూడేళ్లలో పూర్తి చేస్తామన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ప్రేమ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎందుకు లేదని ఆమె నిలదీశారు. కేసీఆర్.. చంద్రబాబు నాయుడు పేరు తీసుకుని మరోసారి ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలని చూస్తున్నారని డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా కల్వకుంట్ల కవితకు కండ్లు ఉంటే.. గద్వాల అభివృద్ధి కనిపించేదని చురకలంటించారు. పదేళ్లు తండ్రి చాటు ఉండి.. ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా అని అరుణ చురకలంటించారు. ఆస్తుల పంచాయతీతో ప్రజలను ఫూల్స్ చేయాలనుకుంటే ప్రజలు ఫూల్స్ కారని పేర్కొన్నారు.
Also Read: Chiranjeevi Mohanlal: మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం కోలీవుడ్ సూపర్ స్టార్.. ఇక ఫ్యాన్స్‌కు పండగే?

