Telangana Temples: ఆలయాలకు వెళ్లే భక్తుల జేబులు గుల్ల అవుతున్నాయి. పూజా కైంకర్యాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అదనంగా సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. జాతర సమయాల్లో ఆలయాలకు భక్తులు అధికంగా వస్తుంటారు. అదే అదునుగా భావించి సిబ్బంది ప్రతి దానికి ఒక రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. కొన్ని ఆలయాల్లో మాత్రం కొంతమందిని ఎంచుకొని వారికి దర్శనాల పేరిట, పూజల పేరిట వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పలు ఆలయాల్లో కంప్యూటర్ టికెట్లు కాకుండా ప్రత్యేక టోకెన్ పుస్తకాలను ముద్రించి వసూలు చేస్తున్నట్టు సమాచారం. అయినప్పటికీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఆలయాల్లో సిబ్బంది ఆడింది ఆటగా సాగుతున్నది.
టికెట్ రూ.150.. అదనంగా రూ.500
ఐనవోలు మల్లికార్జున స్వామి దర్శనానికి ఆదివారం ఓ కుటుంబం వెళ్లింది. స్వామివారి పట్నం వేసేందుకు 150 రూపాయలు టోకెన్ తీసుకున్నది. పట్నం వేయాలని ఒగ్గు పూజారులకు టోకెన్ ఇవ్వగా రూ.500 ఇస్తేనే పట్నం వేస్తామని, పాటలు పాడుతామని తేల్చి చెప్పారు. వెంటనే సంబంధిత ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయగా మాట్లాడుతానని చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. హనుమకొండ జిల్లాలోని ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం, పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం, సిద్దిపేట జిల్లా కొమురవెల్లి స్వామి ఆలయంలో భక్తులు ఎక్కువగా స్వామివారి పట్నం వేస్తుంటారు. జాతర సమయాలలో స్వామివారికి పట్నం వేసి మొక్కులు తీర్చుకుంటారు. అయితే, దేవదాయ శాఖ మల్లన్న పట్నం వేసేందుకు టికెట్ ధర రూ.150గా నిర్ణయించింది. కానీ, ఒగ్గు పూజారులు మాత్రం అదనంగా చెల్లిస్తేనే పట్నం వేసి పాట పాడుతున్నారని లేకుంటే పాడడం లేదని భక్తులు వాపోతున్నారు. ఒక పట్నం పూజ పూర్తి చేయాలంటే సుమారు రూ.600 పైగా అదనంగా ఖర్చవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ నిర్ణయించిన టోకెన్ ధరకూ వాస్తవ రూపంలో పొంతన లేదని పలువురు విమర్శిస్తున్నారు.
Also Read: Rail Ticket Hike: బిగ్ బ్రేకింగ్.. టికెట్ రేట్లు పెంచిన రైల్వే.. ఎంత పెరిగాయో తెలుసా?
ఆలయాల ప్రతిష్టకు దెబ్బ
స్వామివారికి పట్నం వేసే ముందు మైల పోలు తీస్తారు. దీనికి కూడా 100 నుంచి 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ఇలా చేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు తలనీలాలకు సైతం టోకెన్ రూ.50 తీసుకున్నా, మరో రూ.100 నుంచి రూ.150 వసూలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కొబ్బరికాయ 30 రూపాయలు ఉండగా రూ.50కి పైగా వసులు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్నింటికీ ధరలు పెంచడంతోపాటు, అదనంగా భక్తుల నుంచి వసూలు చేస్తుండడం ఆలయాల ప్రతిష్టను దెబ్బ తీస్తున్నది.
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో జాతర, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై సైతం ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. వారి పర్యవేక్షణ కొరవడంతోనే భక్తుల నుంచి సిబ్బంది అదనపు వసూళ్లు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రతి ఆలయానికి ఈవోలు ఉన్నప్పటికీ వారి పర్యవేక్షణ కూడా కరువైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి రావలసిన ఆదాయానికి సైతం సిబ్బంది గండి కొడుతున్నారని ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో ఏదో ఒక ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని, టికెట్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని వెలుగులోకి వస్తున్నా కూడా ఉన్నతాధికారులు స్పందించకపోవడం, పర్యవేక్షణ చేయకపోవడం విమర్శలకు దారి తీస్తున్నది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తారా లేదా చూద్దాం.
Also Read: Anil Ravipudi: ‘AI’ ని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు.. అనిల్ రావిపూడి పోస్ట్ వైరల్!

