Fire Accident:
నారాయణఖేడ్, స్వేచ్ఛ: కంగ్టి మండల పరిధిలోని తూర్కవడగంలో ఉన్న శ్రీ సమర్థ్ కోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో (పత్తి కొనుగోలు, జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ కేంద్రం) ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఫ్యాక్టరీ ప్రాంగణంలో మినీ ట్రాక్టర్ ద్వారా పత్తి తరలిస్తుండగా, ట్రాక్టర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ట్రాక్టర్‌లో ఉన్న పత్తికి మంటలు అంటుకొని, క్షణాల్లోనే మంటలు చుట్టుపక్కల ఉన్న పత్తి నిల్వలకు వ్యాపించాయి. దీంతో, భారీ అగ్ని ప్రమాదంగా మారినట్లు అధికారులు భావిస్తున్నారు.
Read Also- Rail Ticket Hike: బిగ్ బ్రేకింగ్.. టికెట్ రేట్లు పెంచిన రైల్వే.. ఎంత పెరిగాయో తెలుసా?
కాగా, సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో ఘటన స్థలానికి చేరుకుంది. ఫైర్ సిబ్బంది 4 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు జిన్నింగ్ యూనిట్ మొత్తం వ్యాపించకుండా సకాలంలో చర్యలు చేపట్టడంతో ప్రమాద తీవ్రత కొంతమేర తగ్గింది. లేదంటే, నష్టం మరింత భారీ స్థాయిలో ఉండేది.
Read Also- KCR On Chandrababu: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు శాపం.. చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ భారీ అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి, ఎస్సై దుర్గ రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై ఫ్యాక్టరీ నిర్వాహకులు, సిబ్బందిని విచారించారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 3 వేల క్వింటాళ్ల పత్తి నిల్వలు, జిన్నింగ్ యంత్ర సామగ్రి పూర్తిగా దగ్ధమై సుమారు రూ.4 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నష్టాన్ని అధికారులు ఇంకా ఖరారు చేస్తున్నారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు చెప్పారు. అగ్ని ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వివరించారు.

