TG MHSRB Results: రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(Medical and Health Services Recruitment Board) తీపికబురు అందించేందుకు సిద్ధమైంది. దాదాపు 40 వేల మంది ఆశావహులు ఎదురుచూస్తున్న నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీగా ఉన్న 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే రాత పరీక్ష, ఇతర ప్రక్రియలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల ర్యాంకుల జాబితాను బోర్డు అధికారులు పూర్తిగా సిద్ధం చేశారు. మరో రెండు రోజుల్లో అధికారికంగా ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఈ 2,322 పోస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 వేల మందికి పైగా అభ్యర్థులు పోటీ పడ్డారు. గత కొంతకాలంగా ఫలితాల కోసం వీరంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. బోర్డు తాజా నిర్ణయంతో వీరి నిరీక్షణకు తెరపడనుంది.
Also Read: Maoists Surrender: అజ్ఞాతంలో ఉన్నవారు జన జీవనంలోకి రండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి సూచన
కొలువుల జాతర..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 9 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసింది. ఇందులో గతేడాది రికార్డు స్థాయిలో 7 వేలకు పైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆ ప్రక్రియ ముగిసిన కొద్ది రోజులకే మరో 2,322 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టి, ఇప్పుడు ఫలితాల విడుదలకు సిద్ధమైంది. ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకతతో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ర్యాంకుల జాబితా విడుదల చేసిన అనంతరం, మరోసారి అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు తెలిసింది. ఆ తర్వాతే సెలక్షన్ లిస్ట్ విడుదల చేయనున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు. కొత్త ఏడాది తొలి మాసంలోనే ఉద్యోగాలకు ఎంపికైనా నర్సులు విధుల్లో చేరనున్నారు.
Also Read: Borugadda Anil Kumar: నేనూ పవన్ అభిమానినే.. ఫ్రీగా టికెట్లు కూడా పంచా.. బోరుగడ్డ అనిల్

