అమరావతి, స్వేచ్ఛ: రాష్ట్రంలో ఏడు మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఆయా స్థానాల భర్తీకి ఫిబ్రవరి 3న ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహించనున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపూర్, పార్వతీపురంమన్యంలోని పాలకొండ మునిసిపాలిటీల్లో చైర్‌పర్సన్లు, నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం, ఏలూరు జిల్లాలోని నూజివీడ్, కాకినాడ జిల్లాలోని తుని, పాల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మునిసిపాలిటీల్లో వైస్ ఛైర్మన్ల భర్తీకి ఈ ఎన్నికలు జరగనున్నాయని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించారు. ఈ నెల 30 లోగా ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు. పరోక్ష పద్ధతిలో ఈ ఎన్నికలు జరగనున్నాయని, ఆయా మునిసిపాలిటీల్లో వివిధ కారణాలతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయని నోటిఫికేషన్‌లో ఎన్నికల సంఘం పేర్కొంది.