Polavaram Project: నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ ప్రాజెక్ట్ పనులను ఆంధ్రప్రదేశ్ కొనసాగించకుండా ఉత్తర్వులు జారీ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. 1980 నాటి గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్, 2014లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, కేంద్ర జల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతున్నదని పేర్కొంది.
స్టే ఇవ్వాలని వినతి
పోలవరం ప్రాజెక్టులో భాగంగా దాని కుడి కాలువకు సంబంధించి కొనసాగుతున్న విస్తరణ పనులు, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్‌పై స్టే విధించాలని కోరింది. గోదావరిపై నిర్మాణంలో ఉన్న పోలవరం డ్యాం నుంచి రోజుకు 2 టీఎంసీల నీళ్లను మళ్లించడానికి 58వేల కోట్ల రూపాయల అంచనాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం – నల్లమల సాగర్ ప్రాజెక్టును రూపొందించింది. ఇందులో మూడు దశలు ఉన్నాయి. మొదటి దశలో పోలవరం ఆర్ఎంపీ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుంచి 25వేల క్యూసెక్కులకు పెంచడం. లేదా గోదావరి నుంచి కృష్ణా నదిలోకి నీళ్లను ఎత్తి పోయడానికి సమాంతర కాలువను నిర్మించడం. ఇక, రెండోది 400 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బొల్లపల్లి జలాశయాన్ని నిర్మించడం. మూడోది నల్లమల కొండ ప్రాంతంలోని సొరంగాల ద్వారా నీళ్లను ప్రకాశం జిల్లాలోని నల్లమల సాగర్ జలాశయానికి ఎత్తి పోయడం. అయితే, ఇది తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తుందన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదన.
Also Read: Polavaram Project: నీటి కేటాయింపులు మా పని కాదు.. స్పష్టం చేసిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ
తెలంగాణ వాదన
ఈ ప్రాజెక్ట్ కారణంగా గోదావరి బేసిన్‌లో తమకు కేటాయించిన నీటి వాటాకు, హక్కులకు భంగం వాటిల్లుతుందని తెలంగాణ అంటోంది. ఈ నేపథ్యంలో పోలవరం – నల్లమల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా స్టే విధించాలని కోరింది. ఇక, అంతర్ రాష్ట్ర చిక్కులు, పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా తెలంగాణలో ఏర్పడే ముంపు ప్రమాదాలు, పర్యావరణ ఉల్లంఘనల వంటి అంశాలపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పర్యావరణం, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖలకు చెందిన నిపుణుల కమిటీ ఏపీ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను జూన్లో తిప్పి పంపిస్తూ సీడబ్ల్యుసీతో అంతర్ రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించినట్టుగా పిటిషన్‌లో పేర్కొంది. ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యుసీకి సమర్పించిన ప్రీ ఫీజబిలిటీ రిపోర్టుకు సూత్రప్రాయంగా కూడా అనుమతి లేకున్నా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి డీపీఆర్ కోసం టెండర్లను జారీ చేయడంపై అభ్యంతరం తెలిపింది.
Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో మంత్రులపై మనీ ప్రెజర్.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ మంత్రి

