Singareni: ఒడిశా రాష్ట్రంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మొత్తం 4,900 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్, గ్రీన్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర అనుబంధ సంస్థ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఒడిశా లిమిటెడ్ (ఐపీఐసీఓఎల్)తో 18న (గురువారం) రెండు ప్రాథమిక ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు సింగరేణి సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సింగరేణి సంస్థ ఒడిశాలో ప్రారంభించిన నైనీ బొగ్గు బ్లాక్‌కు అనుబంధంగా 2,400 మెగావాట్ల సామర్థ్యం గల అల్ట్రా సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఉత్పత్తి అవుతున్న బొగ్గును క్యాప్టివ్ థర్మల్ ప్లాంట్‌కు వినియోగించాలన్న నిబంధన ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు ఒడిశాతో పాటు సింగరేణి సంస్థకు కూడా ఎంతో మేలు చేకూరుస్తుందని సీఎండీ వివరించారు.
Also Read: Singareni: సింగరేణి వ్యాపార విస్తరణ వ్యూహం.. ఎన్టీపీసీతో మెగా ఒప్పందం
గ్రీన్ ఎనర్జీ ప్రణాళికలు
సింగరేణి సంస్థ పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రణాళికలు వేస్తోంది. దీనిలో భాగంగా ఒడిశా రాష్ట్రంలో మొత్తం 2,500 మెగావాట్ల సామర్థ్యం గల పునరుత్పాదక ఇంధన ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా 1,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు, 500 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, 500 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లు, 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు ఉంటాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులపైనా ఐపీఐసీఓఎల్‌తో 18న ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఒడిశా ప్రయోజనాలు, విద్యుత్ అవసరాల రీత్యా సింగరేణి సంస్థతో కలిసి నడిచేందుకు తాము సంసిద్ధంగా ఉన్నట్లు ఐపీఐసీఓఎల్ ప్రతినిధులు తెలియజేశారు.
Also Read: Singareni Collieries: భవిష్యత్తులో కీలక ఖనిజాల తవ్వకాలు ఉంటే భాగస్వాములవుతాం

