Minister Nara Lokesh: మహిళా క్రికెట్ ప్రపంచకప్ లో భారత జట్టు తరపున అద్భుత ప్రదర్శన చేసిన ఏపీకి చెందిన శ్రీచరణికి కూటమి ప్రభుత్వం భారీ బహుమతి అందచేసింది. మంత్రి నారా లోకేశ్ రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో తనను కలిసిన శ్రీచరణికి స్వయంగా చెక్ ను అందించారు. మహిళల ప్రపంచ కప్ లో భారత్ తరపున బరిలోకి దిగిన శ్రీచరణి విశేష ప్రతిభను కనబరిచారు. రాష్ట్రానికి ఎనలేని పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రతిభను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహాకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎక్స్‌లో పోస్ట్ చేసిన లోకేశ్..
శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్ ను అందజేసిన విషయాన్ని మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ‘మహిళల వన్డే ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం ప్రకటించిన రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని ఉండవల్లి నివాసంలో అందజేశాను. ఈ కార్యక్రమంలో రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు గారు పాల్గొన్నారు’ అని నారా లోకేశ్ ఎక్స్ లో తెలిపారు. చెక్ అందజేత సందర్భంగా శ్రీచరణితో దిగిన ఫొటోలను సైతం పంచుకున్నారు.
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం ప్రకటించిన రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని ఉండవల్లి నివాసంలో అందజేశాను. ఈ కార్యక్రమంలో రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, శాప్ ఛైర్మన్… pic.twitter.com/Kmbb7eJoxM
— Lokesh Nara (@naralokesh) December 17, 2025
వైజాగ్‌లో స్థలం, గ్రూప్ – 1 జాబ్
యువ మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదుతో పాటు వైజాగ్ లో 500 గజాల స్థలాన్ని సైతం అందిస్తామని గతంలోనే కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అలాగే డిగ్రీ పూర్తైన వెంటనే గ్రూప్ – 1 హోదా ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. అటు కడప జిల్లాకు చెందిన శ్రీచరణి.. అంతర్జాతీయ క్రికెట్ లో రాణిస్తున్నారు. మహిళల వన్డే ప్రపంచకప్ ను భారత్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో క్రికెట్ లో మరింత ఉన్నతస్థాయికి ఎదిగేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆమెకు అండగా నిలుస్తోంది.
Also Read: Satyameva Jayate Slogans: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ధర్నా.. బీజేపీ కుట్రలను ఎండగట్టిన ఎంపీ చామల
శ్రీచరణి గురించి ఇవి తెలుసా?
శ్రీచరణి.. కడప జిల్లాలోని వీరపనేని మండలం ఎర్రమల్లె గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి.. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీచరణి క్రికెట్ తో పాటు చిన్నతనంలో బ్యాడ్మింటన్, కబడ్డీ సైతం బాగా ఆడేవారు. 16 ఏళ్ల వయసు నుంచి క్రికెట్ పై ఆమె మరింత ఏకాగ్రత పెట్టారు. తన మామయ్య కిషోర్ కుమార్ రెడ్డి తనను క్రికెట్ వైపు ప్రోత్సహించినట్లు శ్రీచరణి గతంలో తెలిపింది. తొలుత ఫాస్ట్ బౌలర్ గా ట్రైనింగ్ తీసుకున్నప్పటికీ అందులో రాణించలేకపోయారు. దీంతో స్పిన్నర్ గా మారి.. సక్సెస్ అయ్యారు. అలా 2, 3 ఏళ్ల వ్యవధిలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో దిల్లీ జట్టు ఆమెను కొనుగోలు చేసింది. దిల్లీ తరపున రాణించడంతో వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన భారత మహిళల టీమ్ లో ఆమెకు చోటు దక్కించుకుంది. ప్రపంచకప్ లో భారత్ తరపున 9 మ్యాచ్ లు ఆడిన శ్రీచరణి.. 78 ఓవర్లు వేసి 14 కీలక వికెట్లు పడగొట్టింది.

