Ponnam Prabhakar: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన, ఉపాధి హామీ చట్టం పేరు మార్చి దానిని పూర్తిగా నిర్వీర్యం చేయాలని మోదీ ప్రభుత్వం చూస్తోందని, ఇది పథకానికి ఉరితాడు వేయడమేనని మండిపడ్డారు. ఉపాధి హామీ చట్టంలో కేంద్రం తీసుకువస్తున్న సంస్కరణలు గొప్పవి అయితే, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎందుకు చర్చించలేదని మంత్రి ప్రశ్నించారు. పార్లమెంట్‌లో హడావిడిగా బిల్లులు తీసుకురావడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ఇప్పటికే కుంటిసాకులు చెబుతూ కేంద్రం ఉపాధి హామీ నిధుల్లో కోతలు విధిస్తోందని ఆరోపించారు. పథకం పేరు నుంచి గాంధీ పేరును తొలగించి గాంధీని అవమానపరుస్తున్నారని, ఇది దుర్మార్గమని అన్నారు. బీజేపీకి ఇప్పటికే గాడ్సే వారసులుగా పేరు ఉందని విమర్శించారు. ఉపాధి హామీ కాంగ్రెస్ బ్రెయిన్ చైల్డ్ కాబట్టి దానిని చంపే కుట్ర జరుగుతోందని అన్నారు.
ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం
ఒక చట్టానికి మార్పులు, చేర్పులు చేస్తున్నప్పుడు రాష్ట్రాలతో చర్చించి, వారి అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులను విడుదల చేయకుండా కేంద్రం దోచుకుంటుందని, సెస్సుల పేరుతో నిధులు దారి మళ్లిస్తోందని ఆరోపించారు. పథకం నిధుల్లో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని భారం మోపడం ఫెడరల్ స్ఫూర్తిని చంపే ప్రయత్నమని, దీనిని అడ్డుకుంటామని, పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ ద్వారా ఉపాధి దొరుకుతుందని, పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీని తీసుకొస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ కేంద్రం ఉన్న పథకాన్ని తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఉపాధి హామీ బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, పేదల పొట్టలు కొట్టే ప్రయత్నం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి గాంధీ పేరుతో ఉపాధి హామీ పథకాన్ని పట్టణాల్లో సైతం మరింత విస్తరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
Also Read: Ponnam Prabhakar: నూతన సర్పంచ్‌లకు అలర్ట్.. అలా చేస్తేనే నిధులు.. మంత్రి పొన్నం
ఉపాధి హామీ పథకం లో గాంధీ పేరు తొలగింపుపై.. డీసీసీలకు పీసీసీ ఆదేశాలు
జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది.ఏఐసీసీ పిలుపు మేరకు నేడు అన్ని జిల్లా కేంద్రాలలో మహాత్మా గాంధీ చిత్ర పటాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలనీ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఉపాధి హామీ,పథకాన్ని నీరు గార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం అమలు బాధ్యతల నుంచి కేంద్రం పక్కకు జరగాలని కుట్ర చేస్తుందన్నారు.
బీజేపీ కుట్ర చేస్తుంది
పేదలకు, గ్రామీణ ప్రాంత కూలీలకు ఎంతో భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నీరు గార్చాలని బీజేపీ కుట్ర చేస్తుందన్నారు.జిల్లా కేంద్రాలలో డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన తెలియజేయాలన్నారు.దీనితో పాటు జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 28న గ్రామాలలో, మండలాల్లో గాంధీ చిత్రపటాలతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పని కి ఇచ్చే గౌరవాన్ని ప్రకటించాలన్నారు. 17న, 28న ఈ.నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం అయ్యేలా ప్రతి కార్యకర్త, నాయకులు పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
Also Read: Ponnam Prabhakar: రెండేళ్లలో ఆర్టీసీలో 251కోట్ల మంది మహిళలు జర్నీ.. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం

